
అధైర్యపడకండి.. ఆక్రమ కేసులను ఎదుర్కొందాం
● భాస్కర్ నా సొంత మనిషి ● చెవిరెడ్డి బిడ్డలకు జగనన్న భరోసా
తిరుపతి రూరల్: ‘అక్రమ కేసులు పెట్టారు, జైలుకు పంపారని అధైర్య పడకండి.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం.. మీకు అండగా నేనున్నాను, భాస్కర్ నా సొంత మనిషి, ఈ దొంగ కేసులు ఏమీ చేయలేవు.’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెవిరెడ్డి కుమారులకు భరోసా ఇచ్చారు. విజయవాడలోని తాడేపల్లి నివాసంలో చెవిరెడ్డి మో హిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు బుధవారం జగనన్నను కలిశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం, అదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిందితునిగా చేర్చడం వంటి అంశాలపై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారు. దీనిపై స్పందించిన జగనన్న మాట్లాడుతూ ధైర్యంగా ఉండండి, మనం న్యాయపరంగా పోరాడుదాం.. దేవుడు మనకు మంచే చేస్తాడు, మీకు నేను అండగా నిలబడతానని మనోధైర్యం కల్పించారు. జగనన్న మాటకు స్పందించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు మీరే మా ధైర్యం, మీ మాటే మాకు బలం, మీ పోరాటమే మాకు స్ఫూర్తి జగనన్న..అంటూ బదులివ్వడంతో జగనన్న వారి భుజం తట్టి చిరునవ్వులు చిందించారు.