
లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు
తిరుపతి మంగళం : లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి–కరకంబాడి మార్గంలో బుధవారం రవాణాశాఖ అధికారులు ద్విచక్రవాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు కోరిన బైక్‌లు కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ వారికి లైసెన్స్‌లు తీసి ఇవ్వడంలోనూ, రోడ్లపై ఎంత స్పీడు వెళుతున్నాడో, ఎంతమందిని ఎక్కించుకుని బైక్ నడుపుతున్నాడన్న అంశాలపై కూడా చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే ద్విచక్రవాహన తనిఖీల్లో లైసెన్స్‌లు లేకుండా, త్రిబుల్‌రైడ్ చేస్తూ, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హమన్నారు. విద్యార్థులు మొదటి సారి ఇలా పట్టుబడితే జరిమానా రసీదుతో అపరాధ రుసుము వసూలు చేస్తామని, రెండోసారి వాహన నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే న్యాయస్థానం ముందు హాజ రుపరచాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం 40 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేసి, వాహనచోదకుల నుంచి రూ.50 వేలు జరిమానా రూపంలో వసూలు చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, అధికానాజ్, సిబ్బంది పాల్గొన్నారు.