
సారూ..నాణ్యత చూస్తే నవ్వుతారు
నాగరికతకు చిహ్నంగా నిలిచే రహదారులు నాలుగు కాలాల పాటు నిలిచేలా నిర్మిస్తే నలుగురికి ఉపయోగం. కానీ హడావుడిగా చేసిన పనుల్లో నాణ్యత నలిగిపోగా.. నిర్లక్ష్యం తాండవిస్తోంది. రోడ్డు నిర్మాణానికి వాడిన తారు నాణ్యత లేకపోవడంతోపాటు నిబంధనల మేరకు వేయడం లేదు. దీంతో అవి ఎంతకాలం మనుగడలోకి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలో హడావుడిగా జరుగుతున్న రహదారి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. నిబంధనలేవీ పాటించుకుండా ఇష్టారాజ్యంగా చేపట్టారు. రహదారి పనుల్లో నాణ్యత లేదని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలో అక్కడక్కడా రహదారి పనులు చేపడుతున్నారు. రూ.కోట్ల పనులన్నీ అధికార పార్టీకి చెందిన నాయకుడే చేస్తున్నారు. కూటమి పార్టీలోని మరి కొందరు కావాలని అడిగినా.. లేదని తేల్చిచెప్పేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలని సమాధానం ఇచ్చినట్లు కూటమి నేతలు గుసగుసలాడుతున్నారు. తిరుపతి నగరం పరిధిలో చెర్లోపల్లి నుంచి యూనివర్సిటీ వరకు, రామానుజ కూడలి నుంచి రేణిగుంట వరకు ఆర్‌అండ్‌బీ ద్వారా రోడ్డు వేయించేందుకు చక్రం తిప్పారు. ఆ పనులను దక్కించుకుని తారురోడ్డును చక చకా వేస్తున్నారు. ప్యాచ్ వర్క్‌లతో సరి పెట్టుకోవాల్సిన రోడ్డు పైన కొత్తగా రోడ్డు వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం అంతా కాంట్రాక్ట్ పనుల ద్వారా రూ.కోట్లు దక్కించుకునేందుకేనని తెలుస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా కొన్ని పనులకు పచ్చ జెండా ఊపించి, పనులను తన కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేరుతో దక్కించుకుని దోచుకుంటున్నారని కూటమి నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పనులను నాసిరకంగా చేపట్టి కాంట్రాక్టు పనుల్లో ఆయన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న తారు నాణ్యత లేదని, రోడ్డుపై వేయాల్సిన లేయర్ (మందం) ఎక్కడ అమలు కావడం లేదని అమరావతిలోని ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. వేయాల్సిన చోట వేయకుండా.. బాగా ఉన్న రోడ్లపై తూతూ మంత్రంగా రోడ్ వేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా టెండర్‌లో 20నుంచి 40 శాతం వరకు తక్కువ ఖర్చుతో కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకుంటారు, అయితే కూటమి పార్టీకి చెందిన ఆ నేత మాత్రం రూ.20 కోట్ల కాంట్రాక్టు రూ.20 కోట్లకు (వందశాతం) టెండర్ ఎలా సంపాదించుకున్నారని చర్చించుకుంటున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ప్రొక్లైయిన్‌లు రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే ఇతరత్రా యంత్రాలు అన్ని కూడా తన సంస్థకు చెందినవేనని వీడియోలు, ఫొటోలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తిరుపతిలో ఎప్పుడూ కనిపించని ఆ వాహనాలు కొత్తగా దర్శనమిస్తుండడంతో కాంట్రాక్టర్లతోపాటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నగర శాఖ తీవ్రంగా తప్పుబట్టింది.
తిరుపతి నగరంలో నాసిరకంగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు
రహదారుల పనుల్లో అవినీతి
తిరుపతి నగరంలో హడావుడిగా రహదారి పనులు
నాణ్యతకు తిలోదకాలు.. పట్టించుకోని అధికారులు
కాంట్రాక్టు పనులన్నీ ఆ నేతకే.. కూటమిలో మరొకరికి నో ఛాన్స్
ఎన్నికల్లో ఖర్చు పెట్టాను.. రాబట్టుకోవాలి కదా అంటున్న ఆ నేత

సారూ..నాణ్యత చూస్తే నవ్వుతారు