
కానిస్టేబుల్ కొడుక్కి కానిస్టేబుళ్ల సమస్యలు పట్టవా..?
తిరుపతి మంగళం: ‘మానాన్న ఒక కానిస్టేబుల్.. నేను కానిస్టేబుల్ కొడుకుని.. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినవాడిని.. పేదల కష్టాలు పూర్తిగా తెలిసినవాడిని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పేదవాడికి, ఉద్యోగికి, మహిళకు ఏ కష్టం రానివ్వకుండా వెన్నంటి ఉండి కాపుగాస్తా’.. అంటూ పదే పదే ఊదరగొట్టిన పవన్‌కళ్యాణ్‌కు కానిస్టేబుళ్ల సమస్యలు పట్టవా? అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలపై బుధవారం ఆయన ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ ఎండనక, వాననక, ధుమ్ముధూళిని లెక్కచేయకుండా నిత్యం రోడ్లపై పహారా కాస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న కానిస్టేబుళ్లు(పీసీ)లకు ఏడాదిన్నర కాలంగా టీఏ, డీఏలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నిత్యం కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌కు వారి సమస్యలు చెవున పడడంలేదా? పడినా.. పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా? అని అన్నారు. ఎన్నికలకు ముందు ఎవరికీ ఏ కష్టం రానివ్వనంటూ రోడ్లపై పడుకుని అరిచి చెప్పిన పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక దిష్టిబొమ్మలా మారారని విమర్శించారు. పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలు పట్టించుకోరు, ప్రజల సమస్యలు పట్టించుకోరు, ఆఖరికి కానిస్టేబుల్ కొడుకుగా కానిస్టేబుళ్ల సమస్యలను పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యమేమిటో చెప్పాలన్నారు. ఇప్పటికై నా స్పందించి కానిస్టేబుళ్లకు టీఏ, డీఏలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
భూమన అభినయ్‌రెడ్డి