
ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ
చంద్రగిరి: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నమోదును పెంచాలని, విద్యార్థుల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి విద్యా సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో తోడ్పాటు అందించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచి, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. మునుపటి విద్యా సంవత్సరంలోని పదో తరగతి ఫలితాలను ప్రధానోపాధ్యాయులతో చర్చించి, ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలిత కుమారి, హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఆర్‌ఎఫ్ రోడ్డులోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాలోనూ ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థులు హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో, చక్కటి విద్యను అందించడంపై ఆయన సంతృప్తి చెందడంతో పాటు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
17న ఐఐటీ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కామన్ ఇంకుబేషన్ సెంటర్ ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు.
ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న భవనం

ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ