
బీసీ మహిళలకు రక్షణ కరువు
● కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌పై
దాడి హేయం
● వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైయిందని, అడుగడుగునా బీసీ మహిళలకు అవమానాలు చోటు చేసుకుంటున్నాయని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ , జనసేన గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకు అంతులేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులు కూటమి నేతల కీలుబొమ్మలా మారిపోయిందన్నారు. ఒక జిల్లా చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూడటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా న్యాయం చేయడంలేదని మండిపడ్డారు. బీసీలంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని మేయర్ ప్రశ్నించారు. గత జగనన్న పాలనలో బీసీ మహిళలకు ఉన్నత పదవులను కల్పించి ఉన్నత స్థాయిని కల్పించారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాదవిరెడ్డి మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై కూటమి గూండాలు దాడు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడడం దుర్మార్గమన్నారు. మహిళలపై దాడులు చేస్తే తాటతీస్తానన్న పవన్‌కళ్యాణ్‌కు ఇలాంటివి కనబడవా? అని ప్రశ్నించారు. కూటమి గూండాలకు ప్రజలే బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆరణి సంద్య, కోటమ్మ, ఆదిలక్ష్మి, పుణీత, కోటూరు ఆంజినేయులు, బోకం అనీల్‌కుమార్, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, బీసీ నాయ కులు పుల్లయ్య, చిన్నియాదవ్, మల్లెమొగ్గల ఉమాపతి, పార్టీ నాయకులు తలారి రాజేంద్ర, ఉదయ్‌వంశీ, వాసుయాదవ్, మల్లం రవికుమార్‌రెడ్డి, దినేష్‌రాయల్, మద్దాలి శేఖర్, కడపగుంట అమరనాధరెడ్డి, పడమటికుమార్, పెరుగు బాబూయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న
వైఎస్సార్‌సీపీ నాయకులు