
పంటల బీమాపై అవగాహన కల్పించాలి
చంద్రగిరి : జిల్లాలోని రైతులందరూ 2025–26 గాను రైతులు స్వచ్ఛందంగా పంటల బీమాకు నమోదు చేసుకోవచ్చునని, ఇందుకోసం జిల్లా అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ , ఉద్యాన శాఖల అధికారులతో పంటల బీమా పథకంపై డీఎల్‌ఎంసీ కమిటీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి రైతు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
బీమా ప్రీమియం వివరాలను వెల్లడించిన జేసీ
వరి పంటకు గ్రామాన్ని యూనిట్‌గా, సజ్జ పంటకు జిల్లాను బీమా యూనిట్‌గా పరిగణిస్తారని జేసీ తెలిపారు. వరి పంటకు ఒక హెక్టారుకు రూ.420 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా సజ్జ పంటకు హెక్టారుకు రూ.160 చెల్లించాలన్నారు. వేరుశనగకు హెక్టారుకు రైతు రూ.1400 , నిమ్మ పంటకు హెక్టారుకు రూ.6,250 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వరి పంట ప్రీమియం కోసం ఆగస్టు 15వ తేదీలోపు, సజ్జకు జులై 31వ తేది, వేరుశనగ, నిమ్మ పంటలకు జులై 15లోపు ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు చివరి తేదీ ఆయన తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులతో కలిసి పంటల బీమా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ గుంటూరు రవికుమార్, ఇన్సూరెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్