
పాఠశాల చదువులకు అంగన్‌వాడీ పునాదులు
పెళ్లకూరు : ప్రాథమిక పాఠశాల చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు పిల్లలకు అంగన్‌వాడీ పునాదులని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతబాయి పేర్కొన్నారు. మంగళవారం తాళ్వాయిపాడు, చిల్లకూరు అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. చిల్లకూరులో నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాళ్వాయిపాడు అంగన్‌వాడీలో చిన్నారులకు అమలు చేస్తున్న మెనూ తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ ఉమామహేశ్వరి, వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
17 నుంచి పాలిసెట్
చివరి దశ కౌన్సెలింగ్
తిరుపతి సిటీ: ఏపీ పాలిసెట్–2025కు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు కౌన్సెలింగ్ చివరి దశ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ కోఆర్డినేటర్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వై ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని అభ్యర్థులు 19వ తేదీలోపు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే లేటరల్ ఎంట్రీ, బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన ఐటీఐ అభ్యర్థులు డిప్లొమో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. సీటు సాధించిన అభ్యర్థులు రూ.6 వేలు ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందాలని సూచించారు.