
ఎన్‌ఎస్‌యూలో ముగిసిన బ్రిడ్జి కోర్సు
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు వారం రోజులుగా నిర్వహించిన బ్రిడ్జి కోర్సు మంగళవారం ముగిసింది. వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ మాట్లాడుతూ.. సంస్కృతంలోని 14 శాసీ్త్రయ అంశాలపై విద్యార్థులకు వారం రోజుల పాటు పరిచయాత్మక బోధన చేశామన్నారు. విద్యార్థులు వర్సిటీలోని సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థాయి చేరుకుని వర్సిటీకి పేరు ప్రతిష్ట తీసుకురావాలని సూచించారు. అనంతరం బ్రిడ్జి కోర్సుకు హాజరైన విద్యార్థులకు ప్రమాణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాకరణ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, డాక్టర్ యశస్వీ, అధ్యాపకులు పాల్గొన్నారు.