
ఏఎన్‌ఎం బదిలీల్లో కూటమి పెత్తనం
తిరుపతి సాక్షిటాస్క్‌ఫోర్స్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 746 మంది గ్రేడ్–3 ఏఎన్‌ఎంలున్నారు. వీరిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 693 మందికి సాధారణ బదిలీలు చేయగా.. మిగిలిన వారిని మెడికల్ గ్రౌండ్స్ కింద చూపించారు. తొలుత మాన్యువల్ ప్రకారం బదిలీలు చేయాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.
సిఫార్సుల వెల్లువ
బదిలీల ప్రకటనతో ఏఎన్‌ఎంలు వారికి అనుకూలమైన ప్రాంతాలు వరించేలా ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూటమి బడా నేతలు, ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. వారి సిఫార్సు లేఖలను బదిలీలకు జత చేశారు. ఈ సిఫార్సులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని చోటామోటా నాయకులు కూడా సొంత లెటర్లతో సిఫార్సులు పంపారు. ఎవరికి వారు సత్తా చాటుకోవాలని శాఖపై పట్టుబట్టారు. సిఫార్సులతో పాటు ఫోన్లు చేసి అధికారులను విసిగించారు. వారి హోదాను గుర్తు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేశారు. ఈకారణంగా ఎవరి సిఫార్సుకు తలొగ్గాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. బదిలీల ప్రక్రియను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖపై బురద
కూటమి నేతల జోక్యం, ఒత్తిడి, సిఫార్సులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శాఖ అధికారులు బదిలీల్లో జూమ్ కౌన్సెలింగ్‌ను తీసుకొచ్చారు. ఈనెల 8వ తేదీ నుంచి జూమ్ ద్వారా కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. 11వ తేదీ రాత్రితో ఈ ప్రక్రియను ముగించారు. అయితే చాలా మందికి అశించిన ప్రాంతాలు రాక అయోమయానికి గురవుతున్నారు. మరికొందర్ని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన ఇప్పటికీ సిఫార్సుల గోల తగ్గడం లేదు. అధికారులపై కొందరు ఏఎన్‌ఎంలు ప్రజాప్రతినిధులు, కూటమి నేతల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆర్డర్ పత్రాలు ఇచ్చేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా శాఖపై బురద పడుతోంది. కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతల జోక్యంతో వచ్చిన యవ్వారమని ఏఎన్‌ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.
గందరగోళం ఏమీ లేదు
జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. జూమ్ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నాం. మాకై తే ఎవరినీ ఇబ్బంది పెట్టించాల్సిన అవసరం లేదు. శాఖలో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులే. వాళ్లను ఇబ్బంది పెట్టించాలని మేము ఏరోజూ కోరుకోం. ఇప్పటి వరకు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ప్రయత్నం చేస్తున్నాం. గందరగోళం ఏమీ లేదు. తప్పులుంటే కచ్చితంగా సరిదిద్దేలా చూస్తాం. సమస్యలుంటే నేరుగా తీసుకురావొచ్చు.
–సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, చిత్తూరు
ముందస్తు బుకింగ్‌లు
ఏఎన్‌ఎంల బదిలీల విషయంలో డిమాండ్ పెరిగే కొద్దీ పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో తమకు తెలియకుండా బదిలీలు చేయకూడదని హుక్కుం జారీ చేశారు. తమకు అనుకూలమైన వారినే వేయించుకుంటామని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ముందస్తుగానే 80శాతం ప్రాంతాలను వారి గుప్పట్లోకి తీసుకున్నారు. అక్కడికి రావాల్సిన వారిని వారే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపారు. కాగా వారి ఒత్తిడికి అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఇక్కడి నుంచి శాఖలో పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసేది లేక వారు చెప్పినట్లు బదిలీలను ముగించారు. కొందరు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉన్న ఏఎన్‌ఎంలు, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఏఎన్‌ఎంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించాలని ప్రయత్నాలు చేశారు.
సహాయకులతో వసూళ్లు?
కొందరు ఏఎన్‌ఎంలే వారి సహాయకులకు కాసులతో ఆశ చూపించారు. తాను అనుకున్న స్థానానికి బదిలీ చేయిస్తే అడిగింత ఇచ్చుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఎన్‌ఎంల బదిలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు రెచ్చిపోయారు. వారు ఒక్కో బదిలీకి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు పలువురు ఏఎన్‌ఎంలు ఆరోపిస్తున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బెదిరింపులు
80 శాతం ముందస్తు బుకింగ్‌లు
ఆపై కొందరు ప్రజాప్రతినిధుల పేరుతో
అనుచరుల దందాలు
కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తామంటూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు
మండిపడుతున్న ఏఎన్‌ఎం, వైద్య సంఘ నేతలు
ఏఎన్‌ఎం బదిలీల్లో కూటమి పెత్తనం జోరందుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో గందరగోళమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 80 శాతం ముందస్తు బుకింగ్ చేసుకుంది. ఆపై పలువురు ప్రజాప్రతినిధుల అనుచరులు తెరపైకి తళుక్కుమన్నారు. కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యేందుకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ దందాతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. కూటమి పెత్తనంపై ఏఎన్‌ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.

ఏఎన్‌ఎం బదిలీల్లో కూటమి పెత్తనం