
విధుల్లో నిర్లక్ష్యంపై ఏఈ సరెండర్
బుచ్చినాయుడు కండ్రిగ : మండలంలోని ట్రాన్స్‌కో ఏఈ చలపతి విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో ఎస్‌ఈ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ఏడీఈ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈ చలపతి 33 కేవీ బీఎన్‌కండ్రిగ ఫీడర్‌లో మరమ్మతుల్లో నిర్లక్ష్యం వహించి, రైతుల వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా ఇవ్వలేదని తెలిపారు. వినియోగదారుల సమస్యలపై స్పందించకపోవడం, విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం చోటు చేసుకున్నా పట్టించుకోకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. ఎస్‌ఈ సురేంద్రనాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మండల ఏఈగా విధుల నుంచి తప్పించి ఎస్‌ఈ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నేటి నుంచి గ్రాప్లింగ్
రాష్ట్ర స్థాయి పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్‌లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, బిలాస్‌పూర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు.
ఎన్‌ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం
తిరుపతి సిటీ : హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్‌ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారు
వైద్య అధ్యాపకులకు
ముగిసిన శిక్షణ
తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంశంపై వైద్య అధ్యాపకులకు మూడు రోజులగా నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో వైద్య విద్య సంచాలకులు, ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ.. మూడు రోజులుగా వైద్య నిపుణులతో వైద్య విద్య బోధనా పద్ధతులు, వైద్య విద్యార్థులకు ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన ప్రధాన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాధ, వేలూరు సీఎంసీ వైద్య కళాశాల అబ్జర్వర్స్ డాక్టర్ మినురేఖ, డాక్టర్ భోఢన రాజన్, అకడమిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్‌ఎన్ మూర్తి, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి, వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు

విధుల్లో నిర్లక్ష్యంపై ఏఈ సరెండర్