
మొక్కుబడిగా సమావేశాలు
● పీటీఎంపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు
● విలీనమైన పాఠశాలల్లో సమావేశాలు రద్దు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం తలపెట్టిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఈ సమావేశానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. అనుకున్న షెడ్యూలు ప్రకారం సాయంత్రం వరకు నిర్వహించాల్సిన వీటికి తల్లిదండ్రులు అధిక శాతం హాజరుకాక పోవడంతో చాలా వాటిలో మధ్యాహ్నానికే సమావేశాలను ముగించేశారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూలు మేర ఈ సమావేశాలను నిర్వహించలేకపోయారు. ఈ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను లీప్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని చెప్పినా యాప్ సర్వర్ పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో గైర్హాజరవ్వడంతో ప్రోగ్రెస్ కార్డులు, మొక్కలను పంపిణీ చేసి మమ అనిపించేశారు. హాజరైన తల్లిదండ్రులతో ఆటలపోటీలు నిర్వహించి మధ్యాహ్నానికే సమావేశాలను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకులకండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మరో పాఠశాలలకు విలీనం చేయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో సమావేశాలను వాయిదా వేశారు.