
పీజీ ఆన్‌లైన్ కోర్సులను రద్దు చేయాలి
తిరుపతి సిటీ : పీజీ విద్యలో ఆన్‌లైన్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం ఎస్వీయూ వీసీ అప్పారావును కలసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి ఆష మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఫీజులు పెంచడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉన్నత విద్యాధికారులు పీజీ విద్యార్థులను తాము చదివే చదువుతో సంబంధం లేని నాలుగు రకాల ఆన్‌లైన్ కోర్సులు స్వయం యాప్‌లో ఎంపిక చేసుకుని, ఒక్కొక్క కోర్సుకు రూ.1000 చొప్పున నాలుగు సబ్జెక్టులకు రూ.4000 ఫీజు చెల్లించాలంటూ చెప్పడం దారుణమన్నారు. ఆన్‌లైన్ కోర్సులో మార్కులు తక్కువ వచ్చి సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే యథావిధిగా ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలని, అటెండెన్స్ తప్పనిసరి అని, ఈ కోర్సులు పూర్తి చేయకపోతే మొత్తంగా పీజీ కోర్సు ఫెయిల్ అయినట్టేనని విద్యార్థులను ఉన్నత విద్యామండలి వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3220 అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా, ల్యాబ్‌లు, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించకుండా ఆన్‌లైన్ కోర్సులలో ప్రతిపాదించడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐ నాయకులు నరసయ్య, గీత, పీడీఎస్‌ఓ నాయకులు స్రవంతి, దేవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.