
సహకార సంఘాల సేవలు వినియోగించుకోండి
తిరుపతి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్ విండో సొసైటీలు)సేవలను రైతులతోపాటు అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆ విభాగానికి చెందిన జిల్లా అధికారిణి నాగవర్ధిని పేర్కొన్నారు. ఇటీవల చిత్తూరు నుంచి బదిలీపై తిరుపతి జిల్లాకు విచ్చేసిన ఆమె బుధవారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్ నుంచి మాట్లాడారు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా సొసైటీల ఆధ్వర్యంలో జిల్లాలో 8 పెట్రోల్ బంకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో తంగేళ్లపాళెం, కాయంపేట, సత్యవేడు, ఎర్రావారిపాళెం, వెంకటగిరి, చిట్టమూరు, చిల్లకూరు, నాయుడుపేట సింగల్ విండో సొసైటీల ఆర్థిక బలోపేతం కోసం రెండేళ్ల క్రితం పెట్రోల్ బంకులు మంజూరు చేశారని వాటిని వాడుకలోకి తీసుకురానున్నామని చెప్పారు. సొసైటీల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు నాణ్యమైన ఎరువులను రైతులకు తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట రుణాలతోపాటు తక్కువ వడ్డీలతో బంగారు రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఆయా మండల పరిధిలోని రైతులు సింగిల్ విండో సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మల్టీపర్పస్ గోదాములను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.