
నల్లపరెడ్డి ఇంటిపై దాడి హేయం
చిట్టమూరు : మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు చేసిన దాడి హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ షేక్ జిలానీబాషా పేర్కొన్నారు. చిట్టమూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, పలువురికి ఆశ్రయమిచ్చిన జమీందారి కుటుంబమన్నారు. అలాంటి కుటుంబంపై రాజకీయ ముసుగులో గుండాల చేత ఇంటిపై దాడి చేయించడం తగదన్నారు. ఎన్నికల ముందు తర్వాత అధికార, ప్రతిపక్షంలో ఉన్న విమర్శలు, ఆరోపణలు సహజమన్నారు. అంతేకాని వ్యక్తిగతంగా తీసుకుని ఆస్తి, ప్రాణనష్టం కలిగే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
13న ఐఐటీలో కామన్ ఇంకుబేషన్ సెంటర్
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈ నెల 13న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా కామన్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.