అనుమతి గోరంత.. తవ్వేది కొండంత | - | Sakshi
Sakshi News home page

అనుమతి గోరంత.. తవ్వేది కొండంత

Jul 7 2025 6:01 AM | Updated on Jul 7 2025 6:01 AM

అనుమత

అనుమతి గోరంత.. తవ్వేది కొండంత

చిట్టమూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మట్టి, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీలో సాగరమాల పేరుతో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వి తరలించి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. 20 సెంట్ల ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి గనుల శాఖ నుంచి కాకుండా స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రంలో ఎంత మేర తవ్వకాలు చేపట్టాలనే విషయాన్ని నమోదు చేయకుండా అనుమతి ఇవ్వడం చూస్తుంటే ఈ అక్రమ బాగోతం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.

లేఅవుట్లకు అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తూ..

యాకసిరి గ్రామ సర్వే నంబర్‌ 425లో 20 సెంట్‌లలో సాగరమాల రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అయితే పెత్తనం కూటమి నాయకులదే కావడంతో వారు అనుమతి లేని మరో 3 ఎకరాలలో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి నాయుడుపేట, కోట, చిల్లకూరు ప్రాంతాలలో వేస్తున్న లే అవుట్‌లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు అధికారులకు అక్రమ తవ్వకాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ భారీ స్థాయిలో ముడుపులు ముట్టడంతో కనీసం అటు వైపుగా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రైవేటు సైన్యం పహారా

అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టే ప్రాంతంలో యువకులు ఒక ప్రైవేటు సైన్యంలా ఉంటూ పహారా కాస్తున్నారు. గ్రావెల్‌ తవ్వకాలు భారీగా చేపడుతున్నారని గ్రామస్తులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకునే సరికే ప్రవేటు సైన్యంలా వ్యవహరించే సుమారు 15 మంది యువకులు క్రికెట్‌ బ్యాట్‌లు, స్టంప్‌లతో అక్కడికి చేరుకుని ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ రాకూడదని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

సాగరమాల పేరుతో గ్రావెల్‌ తరలింపు

పట్టించుకోని అధికారులు

అనుమతి ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఎంత మేర తవ్వకాలు చేపడుతున్నారు. వారికి ఎంత అవసరం ఉంది అనే విషయాలను ఒక్కసారైనా పరిశీలించాల్సిన అధికారులు అనుమతి ఇచ్చాం, మీకు ఎంత వీలుంటే అంత తవ్వుకోపోండని అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు రెండు హిటాచీలు, పది టిప్పర్లు నిరంతరాయంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు తవ్వకాలపై పర్యవేక్షణ ఉంచి అనుమతికి మించి తవ్వకాలు చేయకుండా అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

అనుమతి గోరంత.. తవ్వేది కొండంత1
1/1

అనుమతి గోరంత.. తవ్వేది కొండంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement