వేదనారాయణునికి సూర్యప్రణామం

తీర్థప్రసాదాలు అందుకుంటున్న సోమనాథ్‌ - Sakshi

పిచ్చాటూరు : నాగలాపురంలోని వేదవళ్లీ సమేత వేదనారాయణస్వామి పాదాల చెంతకు సూర్యకిరణాలు ప్రసరించాయి. సూర్యపూజ తెప్పోత్సవాల్లో రెండో రోజైన శనివారం సాయంత్రం సాయంసంధ్య కిరణాలు ద్వారగోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, రాజగోపురాలను స్పృశిస్తూ మెల్లమెల్లగా గర్భాలయ మెట్లను దాటి స్వామి వారి పాదాల సమీపంలో అంతర్థానమయ్యాయి. ఈ అద్బుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. అనంతరం వేదనారాయణుడిని మువ్వగోపాలుని అలంకరణలో ముస్తాబు చేసి గోదాదేవి సమేతంగా తిరుచ్చిపై ఆశీనులను చేశారు. ఉత్సవమూర్తులను సన్నిధి వీధిలో ఊరేగింపుగా తీసుకెళ్లి పుష్కరిణిలోని తెప్పపై కొలువుదీర్చారు. కనులపండువగా గోదావేదనారాయణులు జలవిహారం చేశారు.

చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్‌

సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరిని శనివారం ఉదయం ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికి అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో చైర్మన్‌ను ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3– ఎం3 రాకెట్‌ ప్రయోగానికి శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించామన్నారు. 2014 నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3ని విజయవంతంగా ఐదు పర్యాయాలు ప్రయోగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మా ర్క్‌–3 ద్వారా 36 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఏప్రిల్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ–55ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే జూన్‌, జూలైలో చంద్రయాన్‌–3కి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 2024 ఆఖరుకు గగన్‌యాన్‌ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. షార్‌ అధికారి గోపీకృష్ణ పాల్గొన్నారు.

ముగిసిన ‘సదర్వ–2కే23’

తిరుపతి ఎడ్యుకేషన్‌ : శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల ఈసీఈ విభాగం వారు సదర్వ–2కే23పేరుతో ఏర్పాటుచేసిన రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పలు ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. వీరికి రెండు రోజుల వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు శాస్త్రవేత్త డాక్టర్‌ టి.రాజేంద్ర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top