ఆదివారమూ పనిచేయనున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

మాట్లాడుతున్న డీఆర్వో శ్రీనివాసులు  - Sakshi

చంద్రగిరి: స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆదివారం కూడా విధులు నిర్వహించనున్నట్టు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగనుందన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసే క్రమంలో వినియోగదారులు చలానాలను చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తకుండా స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సిబ్బంది కూడా విధులకు హాజరవుతారన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని ఆలత్తూరు, కొత్తపాళ్లెం గ్రామ రెవెన్యూలో ఏర్పాటు చేయనున్న శ్రీ సత్తి వెంకటసత్యనారాయణరెడ్డి రోడ్డుమెటల్‌ అండ్‌ బిల్డింగ్‌ స్టోన్‌ మెటల్‌ ఇండస్ట్రీస్‌పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో డీఆర్వో శ్రీనివాసులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కొత్తపాళ్లెం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.84, 382లోని 8.71 హెక్టార్లలలో, ఆలత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.513, 516, 517లోని 10.72 హెక్టార్లలో రోడ్డు మెటల్‌ అండ్‌ బిల్డింగ్‌ స్టోన్‌ మెటల్‌ ఇండస్ట్రీస్‌ను నిర్మిస్తోందని తెలిపారు. అనంతరం గ్రామస్తుల నుంచి ప్రజాభిప్రయాన్ని సేకరించారు. మెటల్‌ లారీల వల్ల రోడ్డు దెబ్బతింటుందని, క్వారీ వాహనాల వల్ల దుమ్ముతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ కంట్రోల్‌ బోర్డు ఈఈ నరేంద్ర, తహసీల్దారు పీవీ సుబ్రమణ్యం, గ్రామ కార్యదర్శి స్వర్ణమంజరి, వీఆర్వో భాస్కర్‌ పాల్గొన్నారు.

28న ముక్కంటి

హుండీ లెక్కింపు

శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈనెల 28వ తేదీ మంగళవారం హుండీ కానుకలు లెక్కించనున్నట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను కూడా లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

విద్యారంగంలో

విప్లవాత్మక మార్పులు

రేణిగుంట: జగనన్న ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీసిపాయి విద్యా దీవెనశ్రీ పేరిట 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని ఆయన డీఈఓ శేఖర్‌తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులతో చదువులు సమస్యల వలయంలో సాగేవన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఎంఈఓ ఇందిరాదేవి, హెచ్‌ఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.

స్థల పరిశీలన

పిచ్చాటూరు: అరణియార్‌ వద్ద పర్యాటక అభివృద్ధి పనులకు ఇరిగేషన్‌ అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఇరిగేషన్‌శాఖ శ్రీకాళహస్తి ఈఈ మదనగోపాల్‌ నేతృత్వంలో ఇంజినీరింగ్‌ బృందం ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న అరణియార్‌ కట్ట వద్దకు చేరుకుంది. తుడా మంజూరు చేసిన రూ.1.8 కోట్లతో పనులు చేపట్టడానికి స్థలాన్ని గుర్తించారు. ఈఈ మదనగోపాల్‌ మాట్లాడుతూ తుడా నిధులతో పర్యాటక అభివృద్ధి పనులకు టెండర్ల దశ పూర్తయిందని, వచ్చే వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top