ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా పుంగనూరు

- - Sakshi

పుంగనూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో పుంగనూరును ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2వేల ఎకరాలను కేటాయించేందుకు నివేదిక పంపినట్లు వెల్లడించారు. శుక్రవారం మండలంలోని ఆరడిగుంట వద్ద ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ వారి పైపుల ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్పతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రూ.160కోట్ల వ్యయంతో 56 ఎకరాల్లో పైపుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. 500 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. పరిశ్రమ కోసం ప్రత్యేకంగా 133 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు చేశామన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌లో ఒక్క ఇంధనశాఖకు మాత్రమే రూ.9లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఎవరో అనామకులను తీసుకువచ్చి ఎంఓయూలు చేయించి పంపేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్తలైన ముఖేష్‌ అంబానీ లాంటి వారు సమ్మిట్‌కు హాజరై రూ.13లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ ఇవ్వడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకు నిదర్శనమని కొనియాడారు.

ప్రజలకే జవాబుదారీ..

అభివృద్ధిపై ప్రజలకే జవాబుదారీగా ఉంటామని, సోషల్‌ మీడియాలో విమర్శలు చేసేవారిని పట్టించుకునే ప్రసక్తే లేదని ఎంపీ పెద్దిరెడి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పైపుల పరిశ్రమ భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా నీటి సమస్యలు తలెత్తకుండా నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే హంద్రీ–నీవా కాలువ విస్తరణతోపాటు గాలేరు నుంచి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో పరిశ్రమలకు స్వర్గధామంగా పుంగనూరు వర్ధిల్లుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే పుంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ ఎండీ కేజ్రీవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణన్‌, టీటీడీ బోర్డు మెంబర్‌ పోకల అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వక్ఫ్‌ బోర్డు జిల్లా చైర్మన్‌ అమ్ము, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జి ఫకృద్ధీన్‌ షరీఫ్‌, సర్పంచ్‌ శంకరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నంజుండప్ప పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి

2వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top