క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యం

అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, తదితరులు  - Sakshi

● ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ● జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి తుడా : జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యమని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి 95 శాతం మందికి వ్యాధి నుంచి ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. మందులతో పాటు ఆరు నెలలకు సరిపడే పోషకహార వస్తువులను అందజేశామని గుర్తుచేశారు. క్షయవ్యాధి లక్షణాలు అధికంగా ఉన్న వారికి హెచ్‌ఐవీ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్రమంతప్పకుండా మందులను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్షయవ్యాధి లక్షణాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీహరి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా క్షయవ్యాఽధి బాధితులను గుర్తించామన్నారు. తిరుపతి, చంద్రగిరి, పుత్తూరు, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, కోట, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో క్షయవ్యాధి యూనిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. గత ఏప్రిల్‌ నుంచి నిర్వహించిన పరీక్షల్లో 5,729 మంది వ్యాధి గ్రస్తులు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఇందులో 5,268 మందికి వైద్య చికిత్సలు అందించామని, అందరికీ హెచ్‌ఐవీ పరీక్షలు సైతం చేపట్టినట్టు వెల్లడించారు. టీబీ కంట్రోల్‌ అధికారి అరుణ సులోచనదేవి, వైద్యాధికారులు శ్రీనివాసరావు, హనుమంతరావు, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమునీంద్రుడు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌, పలమనాలజిస్ట్‌ డాక్టర్‌ సుబ్బారావు, లైన్స్‌క్లబ్‌, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

రోజూ అర్జీల స్వీకరణ

తిరుపతి అర్బన్‌: గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ సాయంత్రం 3–5 గంటల సమయంలో అర్జీలను స్వీకరించాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వర్చువల్‌ విధానంలో అన్ని మండలాల ఏంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్యాధికారులతో కలెక్టర్‌ పలు అంశాలపై సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వారానికి ఒకసారి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు నెలకు ఒకసారి, మహిళా పోలీసులు నెలకు ఒకసారి వారి పరిధి లోని పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. సమ స్యలను కన్సిస్టెంట్‌ రిథమ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. డీఈఓ వీ.శేఖర్‌, డీఎంహెచ్‌ఓ శ్రీహరి, సీపీఓ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top