శ్రీవారి సేవలో క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌

క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌
 - Sakshi

తిరుమల : భారత క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ జనరల్‌ బ్రేక్‌ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.

నేడు ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ

పుంగనూరు: మండలంలోని ఆరడిగుంటలో నిర్మిస్తున్న ఫెరాఆలయ్‌ ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శుక్రవారం ఉదయం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో ఏర్పాట్లను గురువా రం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ పరిశీలించారు. వీరితోపాటు నూతన ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి సర్పంచ్‌ శంకరప్ప, ఎంపీటీసీ నంజుండప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు వంటల రెడ్డెప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 53,146 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,655 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3 కోట్లు భక్తులు సమర్పించారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

మళ్లీ చిరుత కలకలం

పాకాల : మండలంలోని లింగనపల్లి పంచాయతీ సమీపంలో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పెనుమూరు మార్గం నుంచి కనంముందర పల్లికి సమీపంలో విద్యార్థులు, ప్రయాణికులతో ఆటో వెళుతుండగా ఆటోకి 5 అడుగుల దూరంలో పడమర నుంచి తూర్పు వైపు ఓ చిరుత పులి వెళ్లింది. వెంటనే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ ప్రాంతానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో చుట్టు ప్రదేశాలను పరిశీలించారు. తిరిగి 12 గంటల ప్రాంతంలో చిరుత పులి ఉదయం వెళ్లిన మార్గానికి కొంత దూరంలో తూర్పు నుంచి పడమర వైపు వెళ్లడాన్ని పెనుమూరు నుంచి వస్తున్న ప్రయాణికులు గమనించారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

జిల్లా జడ్జి పోస్టుల

ఫలితాలు విడుదల

తిరుపతిలీగల్‌ : రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన జిల్లా జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్‌లో గురువారం విడుదల చేసింది. 145 మంది అభ్యర్థులు సాధించిన మార్కులు, ఇతర వివరాలను హైకోర్టు పేర్కొంది.

26న అండర్‌–17 ఓపెన్‌

గర్ల్స్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌

గూడూరు: తిరుపతి జిల్లా అండర్‌–17 ఓపెన్‌ గర్‌ల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌–2023ను గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో రాయ్‌ చెస్‌ అకాడమీ, తిరుపతి అడహక్‌ చెస్‌ కమిటీ, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌.కె.షరీఫా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2006 తరువాత జన్మించిన బాలికలు అర్హులని, తమ ధ్రువీకరణ పత్రాలతో టోర్నీలో పాల్గొనే క్రీడాకారిణిలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25వ తేదీ రాత్రి 9 గంటలలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top