పశు సంపదను కాపాడుకుందాం

మేతకు వెళుతున్న పశువులు  
 - Sakshi

● ఎండ తీవ్రతపై అప్రమత్తత అవసరం ● పశువులకు వడదెబ్బ తగిలే అవకాశం ● నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత

చిత్తూరు అగ్రికల్చర్‌: వేసవిలో ఎండల తీవ్రత నుంచి పశు సంపదను కాపాడుకోవలసిన అవసరం ఉంది. మండు టెండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తాపంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. చిత్తూరు డివిజన్‌ పరిధిలో 1,036 గేదెలు ఉండగా, 4.16 లక్షల మేరకు ఆవులు ఉన్నాయి. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే పాలను విక్రయించుకుని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఎండ తీవ్రత వలన పశువులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. తద్వారా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే కాకుండా, పశువులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. రైతులు పశువులను ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రోజువారీ యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందని పశువైద్యాధికారులు తెలియజేస్తున్నారు.

యాజమాన్య పద్ధతులు ఇలా

సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత వల్ల పాడి పశువులు ఒత్తిడికి, అసౌకర్యానికి లోనవుతాయి. తద్వారా మేత తీసుకోవడం తగ్గిపోతుంది. దీంతో పాల దిగుబడి, పాలలో వెన్నశాతం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పశువుల సంరక్షణకు రోజువారీ యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంది.

● పశువుల షెడ్డులో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి.

● షీట్లు వేసిన షెడ్డుపై 8–10 సెం.మీ.మందంతో ఎండు గడ్డిని పరిచి రోజుకు రెండు, మూడు సార్లు నీటితో తడపాలి. షెడ్డుకు ఇరువైపులా గోనె సంచులను కట్టి నీటితో తడపడం ద్వారా షెడ్డు లోపల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు వేడి గాలుల తీవ్రతను తగ్గించవచ్చు. వీలైతే నీటి స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

● షెడ్డు చుట్టూ సుబాబుల్‌, అవిసె, మునగ చెట్లు, పశుగ్రాసం పెంచడం వలన నీడతో పాటు పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు.

● ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు తీసుకెళ్లకూడదు.

● ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మేతకు తీసుకెళ్లాలి.

● పశువులు వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వలన మేత తక్కువగా తీసుకుంటాయి. పోషక విలువలు ఉన్న మేతను అందించాలి. ఉదయం పచ్చి మేతను, సాయంత్రం ఎండు గడ్డిని అందించాలి. చాప్‌ కట్టర్‌ను వాడటం వల్ల మేత వృథాను తగ్గించవచ్చు.

● పచ్చిమేత సరిపడా అందుబాటులో లేనప్పుడు సైలేజ్‌, టీఎంఆర్‌, అజొల్లాను వాడవచ్చు.

● మినరల్‌ మిక్చర్‌, ఉప్పును దాణాలో కలిపి పెట్టుకోవాలి.

● పశువులకు అన్ని వేళలా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.

● చూడి పశువులను ఎండలో మేతకు పంపించకూడదు.

● అధిక ఉష్ణోగ్రత వలన హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని పునరుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. సకాలంలో ఎదకు రావు, మూగ ఎద ఉంటుంది. కావున రైతులు పశువులను ఉదయం, సాయంత్రం ఎద లక్షణాల కోసం పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి.

వడదెబ్బ లక్షణాలు

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు వడ దెబ్బకు లోనవుతాయి. పశువులకు వడదెబ్బ తగిలినపుడు ముందస్తుగా లక్షణాలను రైతులు గుర్తించేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పశువు అధిక శరీర ఉష్ణోగ్రతకు గురవడం.

అధిక శ్వాస, నాడి రేటు పెరగడం.

గుండె వేగంగా కొట్టుకోవడం, చొంగ ఎక్కువగా కార్చుతాయి.

చర్మంపై వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి.

వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు స్పృహ కోల్పోయి ప్రాణనష్టం జరగవచ్చు.

వడ దెబ్బకి గురైన పశువును వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకువచ్చి శరీరంపై నీళ్లు చల్లి వెంటనే పశువైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.

నిర్లక్ష్యం వద్దు

వేసవి కాలంలో ఎండ తీవ్రతను అధిగమించేందుకు పాడి రైతులు రోజువారీ యాజమాన్య పద్ధతులను పశువుల్లో తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే పశువులు వడదెబ్బకు గురై పాల దిగుబడి తగ్గడమే కాకుండా, మృత్యువాత పడడం ఖాయం. కావున రైతులు పశువుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. – ప్రభాకర్‌,

పశుసంవర్థక శాఖ డీడీ, చిత్తూరు డివిజన్‌

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top