వ్యూహకర్త సునీల్‌తో కాంగ్రెస్‌ డీల్‌!

Telangana: Congress Party Start Action Plan To Work With Political Consultant - Sakshi

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీకి సేవలు

ఏఐసీసీతో కుదిరిన ఒప్పందం, మార్చి నుంచి రంగంలోకి

పార్టీ స్థితిగతులు, ప్రజానాడి సర్వే, నేతలతో సంప్రదింపులు

పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా కార్యకలాపాల విస్తరణ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికారం సాధించే లక్ష్యంలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జాతీయస్థాయి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సునీల్‌ కనుగోలు సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయం గా తెలిసింది. ఈ అంశంపై నెల రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని, పార్టీకి సునీల్‌ కనుగోలు సేవలందిస్తారని కీలక నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు సునీల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

మొదటి దఫాలో తెలంగాణ, కర్ణాటక...
ఈ ఒప్పందంలో భాగంగా సునీల్‌ బృందం మొద టి దఫాలో తెలంగాణ, కర్ణాటకలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మాదా పూర్‌లో కార్యాలయం ప్రారంభించిన సునీల్‌ టీం ప్రతి పార్లమెంట్‌ నియెజకవర్గాన్ని ఒక్కో యూనిట్‌ గా తీసుకొని పనిచేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరిస్థితి, నేతల బలాబలాలు, కేడర్‌ పరిస్థితి, గత ఎన్నికల్లో పార్టీ ఫలితాల సరళిని సునీల్‌ బృందం అధ్యయనం చేయనుంది. మార్చి మొదటి వారం నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని సునీల్‌ కుమార్‌ తన బృందాన్ని ఆదేశించినట్లు తెలిసింది.

పార్టీ స్థితిగతులు, ప్రజానాడిపై దృష్టి...
సునీల్‌ బృందం ముందుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, సంస్థాగతంగా ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు, జిల్లా, మండల, గ్రామస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీల వ్యవహారం, వాటి బలాబలాలు తదితర అంశాలతో ప్రజానాడి సర్వే నిర్వహించనుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్‌ బృందాలు పర్యటించనున్నాయి. 

పార్టీ కోసం ప్రత్యేక కార్యాచరణ...
రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాలను యూని ట్లుగా విభజించి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గా నికి ముగ్గురు చొప్పున ‘మైండ్‌షేర్‌’ ప్రతినిధులు బాధ్యతలు పర్యవేక్షిస్తారు. అక్కడ పార్టీ కార్యక్రమా లు, నేతల తీరు, వారికున్న ప్రతికూల, అనుకూల పరిస్థితులను ఎప్పటికప్పుడు సెంట్రల్‌ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు నివేదిస్తారు. వారితోపా టు ప్రతి అభ్యర్థి, పార్టీ, ఎంపీ, ఎమ్మెల్యేల సోషల్‌ మీడియా ఖాతాలు పర్యవేక్షించేందుకు 35 మంది రంగంలోకి దిగనున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే పనిలో మరో 15 మంది సీనియర్‌ విశ్లేషకుల బృందం పనిచేయనుంది.

ఎవరీ సునీల్‌ కనుగోలు?
విజయవాడుకు చెందిన సునీల్‌ కనుగోలు కుటుంబం చాలా ఏళ్ల క్రితమే తమిళనాడులో స్థిరపడింది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసిన సునీల్‌... ప్రపంచ దిగ్గజ సంస్థ మెక్‌కిన్సీలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి బీజేపీకి జాతీయ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2016లో పీకే నుంచి విడిపోయి సొంతంగా అసోసియేషన్‌ ఆఫ్‌ బిలియన్‌ మైండ్స్‌ అనే పోల్‌ సంస్థను నెలకొల్పారు.

ఈ సంస్థ ద్వారా బీజేపీ కోసం 2016–17లో యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పనిచేశారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా గెలిచింది. 2018లో డీఎంకేతో ఒప్పందం కుదుర్చుకొని లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే కూటమి 40కిగాను 39 సీట్లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకేకు పనిచేయగా ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top