Telangana Assembly Sessions: రేపటి నుంచి అసెంబ్లీ

Telangana Assembly Sessions Starts From 24th September - Sakshi

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సమావేశాలు 

అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్, కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు

దళితబంధు సహా ఎనిమిది బిల్లులు సభ ముందుకు.. 

తొలిసారిగా మండలికి వాణీదేవి, శాసనసభకు నోముల భగత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. రేపు అసెంబ్లీ సమావేశమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడే అవకాశాలున్నాయి. శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో వెన్నవరం భూపాల్‌రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలో పట్టభద్రుల కోటాలో ఎన్నికైన సురభి వాణీదేవి తొలిసారిగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుసగా రెండోసారి మండలిలో అడుగుపెడుతున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన నోముల భగత్‌ కూడా తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు చట్టబద్ధ్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధ్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. 

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ..
అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో మాదిరిగానే పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top