Wesley Boys Jr‌ College Golden Jubilee: వెస్లీ స్వర్ణోత్సవం.. దేశ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఒకప్పటి కర్మాగారం

Secunderabad Wesley Boys Jr‌ College Golden Jubilee Celebrations On 2021 - Sakshi

యాభై వసంతాల వెస్లీ నేడు స్వర్ణోత్సవ సంబరం 

వేలాది మంది విద్యాకుసుమాలు 

పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు ఈ కాలేజీ విద్యార్థులే..

Secunderabad Wesley Boys Jr‌ College Golden Jubilee Celebrations On 2021: నిరుపేదలకు విద్యను అందించాలనే నాటి మిషనరీల సంకల్పం నుంచి ఆవిర్భవించినవే వెస్లీ విద్యా సంస్థలు.18వ శతాబ్ధంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటైన వెస్లీ విద్యా సంస్థల్లో నుంచి పుట్టుకుని వచ్చిన వెస్లీ జూనియర్‌ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఎందరో విద్య కుసుమాలను దేశానికి అందించడమే కాకుండా క్రీడలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. దేశ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఒకప్పటి కర్మాగారంగా ఉండేది ఈ వెస్లీ జూనియర్‌ కళాశాల.

 అంతకు ముందు వెస్లీ పాఠశాలలోనే కలిసి ఉండి 1970 తర్వాత వెస్లీ జూనియర్‌ కళాశాల మారిన ఈ విద్యా సంస్థ ఈ నెల 7న స్వరోత్సవాలకు సిద్ధమవుతోంది. కార్పొరేట్‌ పోటీ ప్రపంచంలోనూ తన బ్రాండ్‌ ఇమేజ్‌తో సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ ఆధ్వర్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా నిరతితో ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తుంది.  

1853లో ఏర్పాటు 
1873లో వెస్లీ హైస్కూల్‌ గాస్మండిలో ప్రారంభమైంది. 1904లో ప్రస్తుతం పీజీరోడ్‌లోని ప్రాంగణానికి మార్చారు. నాడు 1 నుంచి 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నందున  మల్టీపర్పస్‌ హై స్కూల్‌గా పేర్కొనేవారు. 1970లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల, జూనియర్‌ కళాశాలలను విడదీస్తూ జీవో జారీ చేసింది. దీంతో  వెస్లీ జూనియర్‌ కళాశాలగా ప్రత్యేకంగా ఏర్పాటయ్యింది. ఈ కళాశాల మొట్ట మొదటి ప్రిన్సిపాల్‌గా టీపీ సదానందం పనిచేశారు. ఆ తర్వాత ఎంజే భాస్కర్‌రావు,  ప్రకాశం తదితర విద్యవేత్తల హయాంలో వెస్లీ జూనియర్‌ కళాశాల ఒక వెలుగు వెలిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సాధారణ రుసుముతో హాస్టల్‌ సదుపాయం కల్పించేవారు.  

క్రీడలు...చదువులో సాటిలేదు 
వెస్లీ కళాశాలలో సీటు దొరికిందంటే అదృష్టంగా భావించేవారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న ఎంతో మంది ఆయా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారు.  క్రికెట్‌లో వెస్లీ కళాశాలకు ఏ అకాడమి సాటి వచ్చేది కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఎందరో క్రీడాకారులు ఈ కాలేజీకి చెందిన వారే. శివలాల్‌యాదవ్, వెంకటపతిరాజు, వీవీఎస్‌ లక్ష్మణ్, వంకా ప్రతాప్, ప్రదీప్, విద్యుత్‌ జయసింహ, వివేక్‌ జయసింహ, గణేష్‌,  బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ డీఎల్‌ ఇరా>నీ తదితర ప్రముఖులు ఎందరో ఉన్నారు. 

హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్‌గౌడ్, మాజీ డీజీపీ బాసిత్‌ అలీ, ప్రస్తుత సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఏసీ సాల్మన్‌రాజు, మాజీ మంత్రి అల్లాడి రాజ్‌కుమార్, దుబాయ్‌ షేక్‌ వద్ద సలహదారుగా ఉన్న యూనస్‌ అహ్మద్, యూఎస్‌లో పేరొందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఫ్రాంక్‌ గవిని, ప్రస్తుతం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్, ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్‌ దీన్‌దయాల్‌ ఇక్కడ విద్యనభ్యసించిన వారే. 20 మంది కల్నల్స్, 2 బ్రిగేడియర్‌లుగా మన దేశ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే పేరొందిన ఎంతో మంది వ్యాపార వేత్తలు, సీఏలు వందల మంది ఉన్నారు.  

స్వర్ణోత్సవ సంబురాలు 
50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వెస్లీ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోజస్‌ పాల్, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ నెల 7న సాయంత్రం  ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ విద్యనభ్యసించి ప్రముఖులు ఇక్కడ పనిచేసిన అధ్యాపకులు, సిబ్బందిని సన్మానించనున్నారు. 

వెస్లీకి పునర్‌ వైభవం తెస్తాం
వెస్లీ జూనియర్‌ కళాశాలకు పునర్‌వైభవం తెచ్చేందుకు యాజమాన్యం, అధ్యాపకులు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఇంటర్మీడియేట్‌ నుంచే ప్రతి విద్యారి్థపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారో అందులో ప్రత్యేక శిక్షణ అందిస్తాం. ఎంసెట్, ఐఐటీ, జీ లాంటి వాటితో పాటు సివిల్స్, గ్రూప్స్‌ కోసం ఐ విన్‌ సొల్యూషన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. క్రీడలు, ఎన్‌సీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ దిశగా ఫలితాలు వస్తున్నాయి. జాతీయ స్థాయి క్రికెట్, కబడ్డీ, జూడో క్రీడాకారులు కాలేజీలో ఉన్నారు.  –డాక్టర్‌ మోజస్‌ పాల్, ప్రిన్సిపాల్‌ వెస్లీ కాలేజ్‌  

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top