70 లక్షలు దాటిన కరోనా పరీక్షలు 

The Number Of Corona Tests In Telangana Has Crossed 70 Lakhs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రాష్ట్రంలో 70 లక్షలు దాటింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సోమవారం కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. ఆదివారం నాటికి రాష్ట్రంలో 70,18,564 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,87,740 మందికి కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజు 27,077 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 238 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఇక ఆదివారం 518 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,81,083 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు. ఒక రోజులో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,551 మంది మరణించారన్నారు.  (‘క్లినికల్‌’ తరహాలో కోవాగ్జిన్‌ టీకా )

2.87 లక్షలకు చేరిన కేసుల సంఖ్య
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.87 లక్షలకు చేరింది.  కాగా,  కరోనా రికవరీ రేటు 97.68 శాతం ఉండగా, కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 5,106 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 2,942 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా కరోనా బారినపడినవారు 2,01,418 (70%) మంది కాగా, లక్షణాలతో వైరస్‌ సోకినవారు 86,322 (30%) మంది ఉన్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. (38కి చేరిన కొత్తరకం వైరస్‌ కేసులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top