మే 3 నుంచి ఇంటర్‌ పరీక్షలు!

Inter‌ Exams From May 3 In Telangana - Sakshi

అకడమిక్‌ కేలండర్‌ సిద్ధం చేస్తున్న ఇంటర్‌ బోర్డు

పరీక్షల షెడ్యూల్‌ రూపకల్పనపై కసరత్తు

70 శాతం సిలబస్‌తో నిర్వహణ!

‘ఎంసెట్‌’పై త్వరలోఉన్నత విద్యామండలితో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్‌ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్‌ కేలండర్‌ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్‌ రూపకల్పనపై ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తోంది. మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్‌ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. ఆ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగిం చే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్‌మెంటల్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎంసెట్‌పైనా ఆలోచన
మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌కు కేంద్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్‌ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తీసుకొని, ఉన్నత విద్యా మండలితో సమావేశం కావా లని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. మండలితో నిర్వహించే సమావేశంలో యూనివర్సిటీలు పాల్గొంటాయి కనుక అందులో ఎంసెట్‌ సిలబస్‌ ఎంత ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  చదవండి: (హెడ్మాస్టర్‌ స్థాయి వరకే పదోన్నతులు!)

ప్రాక్టికల్స్‌ ఉంటాయ్‌..
కరోనా కారణంగా విద్యా బోధన దెబ్బతిన్నప్పటికీ ఆన్‌లైన్‌/డిజిటల్‌/టీవీ ద్వారా విద్యా బోధనను బోర్డు నిర్వహించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నప్పటికీ ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యాబోధనను కొనసాగించనుంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను సైతం నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అందుకు అనుగుణంగానే అకడమిక్‌ కేలండర్, పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది.

ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన వారూ పాస్‌!
గతేడాది మార్చిలో (2020) జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ఫస్టియర్‌ విద్యార్థులను పాస్‌ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు ఇచ్చి పాస్‌ చేసింది. కానీ ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది.

నేడో రేపో పాఠశాల విద్య అకడమిక్‌ కేలండర్‌
పాఠశాల విద్య అకడమిక్‌ కేలండర్‌ ఒకటీ రెండురోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే కేలండర్‌ను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది.   

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top