‘లాక్‌డౌన్‌’ అయ్యారు!

Hyderabad People Stuck In America Reason For Corona - Sakshi

250 డాలర్లు చెల్లించి వీసా గడువు పొడిగింపు

పిల్లల వద్ద ఎక్కువ రోజులు గడపటంతో పెద్దవాళ్లు హ్యాపీ

రెగ్యులర్‌గా వాడే బీపీ, షుగర్‌ మందులు దొరక్క కొందరికి ఇబ్బందులు

సాక్షి, హైదరాబాద్‌ : ఆయనో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. అమెరికాలో ఉంటున్న తన కూతురి వద్దకు ఐదు సూట్‌కేసులతో బయలుదేరారు. కస్టమ్స్‌ అధికారులు అడిగేసరికి వాటిని తెరిచి చూపించారు. వాటిల్లో ఓ పెద్ద సూట్‌కేస్‌ నిండా మందులే ఉన్నాయి. అందులో ఒక్కటీ ఆయన వాడేది లేదు. మరి అవన్నీ ఎందుకో తెలుసా..? లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకున్న ఆయనకు తెలిసిన హైదరాబాదీలు వాడే మందులు. కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చేసరికి వారు వాడే మధుమేహం, రక్తపోటు మందులు అయిపోయాయి. అవి అమెరికాలో లభించకపోయేసరికి, తమ మిత్రుడు వస్తున్నాడని తెలిసి ఆయన ద్వారా తెప్పించుకుంటున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. కోవిడ్‌తో అల్లకల్లోలంగా మారిన పరిస్థితులకు ఇదో తార్కాణం. తమ వారిని చూసేందుకు అమెరికాకు వెళ్లి, లాక్‌డౌన్‌ తో ఎంతో మంది అక్కడే ఇరుక్కుపోయారు. ఇందులో కొందరు వందే భారత్‌ విమానాల ద్వారా భారత్‌కు రాగా, పలు సమస్యలతో కొందరు అక్కడే ఉండిపోయారు.

కొన్ని ప్రాంతాల నుంచే వందే భారత్‌
తెలుగువారు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. ప్రతి సంవత్సరం తమ వారిని చూసేందుకు ఇక్కడి నుంచి ఎంతోమంది అమెరికా వెళ్తుంటారు. ముఖ్యంగా విశ్రాంత తల్లిదండ్రులు ఎంతోమంది వేసవిలో అమెరికాలోని పిల్లల వద్దకు వెళ్తుంటారు. ఈ సారి ఇలా వెళ్లినవారిలో చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారు. వీరిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ విమానాలు నడుపుతున్నా, అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఇతర ప్రాంతాలవారు ఇక్కడికే వచ్చి విమానాలు ఎక్కాల్సి రావడంతో వద్దనుకుని అక్కడే ఉండిపోయారు. ఇలా అయినా ఎక్కువ రోజులు పిల్లల వద్ద ఉన్నట్టుంటుందన్న ఉద్దేశంతో కలవారూ ఉన్నారు. తమ వారిని చూసేందుకు వెళ్లినవారికి అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా ఆరు నెలల వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ గడువు తీరిపోవటంతో మనిషికి 250 అమెరికా డాలర్లు చెల్లించి ఎక్స్‌టెన్షన్‌ పొందుతున్నారు.

ఇండియాలో కేసుల భయం...
యూరప్‌ తర్వాత ఒక్కసారిగా కోవిడ్‌ అమెరికాను అతలాకుతలం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది బాధితులున్నది ఆ దేశంలోనే. కానీ, ప్రస్తుతం రోజువారీ అధిక కేసులు నమోదవుతోంది మాత్రం భారత్‌లోనే. అమెరికాలో సమస్య తీవ్రత ఉన్నా, ఇండియాలో కూడా పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో వృద్ధులైన తల్లిదండ్రులను భారత్‌కు పంపేందుకు వారి పిల్లలు అంగీకరించటం లేదు. చాలామంది వర్క్‌ఫ్రం హోంలో ఉండటంతో తల్లిదండ్రులను తమ వద్దే ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. 

విమానాల రద్దుతో ఉండిపోయాం..
మా దంపతులం ప్రతి సంవత్సరం వేసవిలో అమెరికా వస్తాం. మా ముగ్గురు పిల్ల లు ఇక్కడే ఉన్నారు. మార్చి మొదటి వారంలో వచ్చి లాక్‌డౌన్‌ తో ఇరుక్కుపోయాం. ఐదు సార్లు హైదరాబాద్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్నా.. అవి రద్దయ్యాయి. మేముండే చోట వందే భారత్‌ విమాన వసతి లేదు. మరో సిటీకి వెళ్లాలి. ఆ విమానాల్లో కొన్ని ఇబ్బందులున్నాయని తెలుస్తోంది. అయినా వచ్చే ప్రయత్నం చేస్తాం. మా పిల్లల వద్ద ఇన్ని నెలలు ఉండటం ఆనందంగా ఉన్నా.. హైదరాబాద్‌లో నా ఆసుపత్రి నిర్వహణ చూసుకోవాల్సి ఉంది. – డా.రంగయ్య, పిల్లల వైద్య నిపుణులు 

సంవత్సరం పాటు అమెరికాలోనే..
మా అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు వర్జీనియాలో ఉంటాయి. గత డిసెంబర్‌లో ఇక్కడకు వచ్చాం. లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో కేసుల తీవ్రత దృష్ట్యా మమ్మల్ని ఇక్కడే ఉండిపొమ్మన్నారు. 250 డాలర్లు చొప్పున చెల్లించి మరో 6 నెలలకు ఎక్స్‌టెన్షన్‌ తీసుకున్నాం. అమెరికాలో సంవత్సరం పాటు మా పిల్లల వద్ద గడపడం సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. సమీపంలోనే బంధువులున్నా ఒకరి ఇంటికి కూడా వెళ్లలేకపోవటం బాధ కలిగిస్తోంది. ధర్మవరపు రాంమోహన్‌ రావు,  విశ్రాంత ప్రభుత్వ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top