వారియర్స్‌ను మళ్లీ చుట్టేస్తున్న కరోనా వైరస్‌‌

Hundreds Of Hyderabad Police Officers Teste Corona Positive - Sakshi

బాధితులు, నిందితుల ద్వారా పోలీసులకు

ఇప్పటికే వంద దాటిపోయిన పాజిటివ్‌  కేసులు

వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ వస్తున్న వైనం

గోప్యంగా ఉంచుతున్న ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీసు విభాగాన్ని మరోసారి కరోనా వైరస్‌ వెంటాడుతోంది. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇప్పటికే వంద మందికి పైగా దీని బారినపడ్డారు. అయితే నిందితులు లేదా ఫిర్యాదుదారులు ఇలా...ఎవరో ఒకరి ద్వారా అధికారులు, సిబ్బందికి ఈ మహమ్మారి సోకుతోంది. గత వారం చిక్కిన ఓ మోసగాడి ద్వారా టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఐదుగురికి కోవిడ్‌ వచ్చింది. తాజాగా బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ సహా 11 మందికి పాజిటివ్‌గా సోమవారం తేలింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వాక్సిన్‌ తీసుకున్న వారికీ వైరస్‌ సోకుతుండటంతో అధికారులు ఈ అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.  

పోలీసు విభాగానికి సంబంధించి తొలి పాజిటివ్‌ కేసు గతేడాది సైఫాబాద్‌ ఠాణాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అత్యధికం రోడ్ల పైకి వచ్చి డ్యూటీలు చేసే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా ఉన్న పోలీసులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తూ కరోనా టీకా వేయించింది. సిటీ పోలీసు విభాగంలో దాదాపు అంతా రెండో డోస్‌ కూడా వేయించుకున్నారు.

ముగ్గురు ఎస్‌ఐలు సహా ఐదుగురికి కరోనా
అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌ ప్రభావం పోలీసుల్లో కనిపిస్తోంది. సీఎం ఓఎస్డీకి పీఓగా చెప్పుకుని అనేక మందిని మోసం చేసిన కేసులో సుధాకర్‌ను గత వారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని భావించిన అధికారులు వైద్య పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో సుధాకర్‌ను గాంధీ ఆసుపత్రిలోని ప్రిజనర్స్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతడిని అరెస్టు చేసిన, విచారించిన అధికారులు పరీక్షలు చేయించుకోగా.. ముగ్గురు ఎస్‌ఐలు సహా ఐదుగురికి కోవిడ్‌ నిర్ధారణైంది. 

బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు, ఎస్‌ఐ వాసవిలతో పాటు 9 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా తేలింది. సెకండ్‌ వేవ్‌లో ఇలా దాదాపు వంది మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది దీని బారినపడ్డారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... వీరిలో కొందరు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు ఉండడం. ఈ అంశాలను ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు, బాధితులతో సంభాషించేప్పుడు, నిందితుల్ని అరెస్టు చేసే సందర్భంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

శాటైజర్లు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్స్, పీపీఈ కిట్లు వినియోగించాలని సూచించారు. అధికారులు, సిబ్బందిలో ఎవరికి లక్షణాలు ఉన్నా, అనుమానం కలిగినా సెలవు తీసుకోవాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. అటు శాంతిభద్రతల విభాగంతో పాటు ఇటు ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి చేసే పరీక్షల్లోనూ మార్పు చేర్పులు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top