హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

Heavy Rains In Some Parts Of Hyderabad Again On Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బులు లేకుండా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మొత్తం దట్టంగా మబ్బులు అలుముకొని ఉరుములు, మెరుపులతో నగర వాసులకు వణికించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, మీర్‌పేట, ఉప్పల్‌, రామంతపూర్‌, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పాతబస్తీలో మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని ముంపు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

కాగా మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా, రూ.2800 విలువైన సీఎం రిలీఫ్ కిట్లను వరద బాధితులకు నేరుగా అందజేయాలని  జీహెచ్ ఎంసీ అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. 

భారీగా ట్రాఫిక్ జామ్
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్,అబ్దుల్లాపూర్‌మెట్లలో భారీగా కురిసిన వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీనగర్ మన్సూరాబాద్ చెరువు నుండి భారీగా వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆటోనగర్, సుష్మ చౌరస్తా, పనామా చౌరస్తా, చింతల్‌కుంట, నాగోల్ చౌరస్తా, సాగర్ రింగ్ రోడ్‌లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. పోలీసులను అప్రమత్తం చేశారు. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు చేరుకుంది.  4 గేట్లను ఎత్తివేశారు. హిమాయత్‌నగర్‌కు ఇన్‌ఫ్లో 10వేలు, ఔట్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులు నమోదైంది.

(చదవండి: వరద తగ్గింది.. బురద మిగిలింది)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top