నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి..
రిమాండుకు తరలించిన పోలీసులు
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ బస్టాప్‌లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు.
గచ్చిబౌలికి చెందిన ఆర్‌అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్‌ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.


