‘కోవిన్‌ టెంపరేచర్‌ లాగర్‌’తో వ్యాక్సిన్ల పర్యవేక్షణ

Coronavirus Vaccine Preserved By Special Temperature Lager - Sakshi

హైదరాబాద్‌ నుంచే పీహెచ్‌సీల్లోని టీకాల నిర్వహణ 

4 కోట్ల వ్యాక్సిన్లనిల్వ సామర్థ్యం

మన సొంతం ఆటో డిసేబుల్‌

సిరంజీలతో టీకాలు ఈ సిరంజీలుసురక్షితం...

పర్యావరణ హితం ‘సాక్షి’ఇంటర్వ్యూలో

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్లు వేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం రాష్ట్రానికి టీకాలు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలలకు వీటి పంపిణీ మొదలైంది. టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్లను నిర్దేశిత శీతలీకరణలో ఉంచడానికి, వాటిని హైదరా బాద్‌లోని కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించింది. వీటన్నింటినీ తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఆయా అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంట ర్వ్యూలో చంద్రశేఖర్‌రెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...  హైదరాబాద్‌లోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచి రీజినల్‌ కేంద్రాలకు వ్యాక్సిన్లు తరలిపోయాయి. రీజనల్‌ వ్యాక్సిన్‌ సెంటర్ల నుంచి అన్ని జిల్లాలకు వెళ్తాయి. అక్కడి నుంచి గురువారం సాయంత్రానికి అన్ని టీకా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్లు వెళ్తాయి. ఆ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. పటిష్టమైన భద్రత నడుమ టీకాలను తరలించాం. 

హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షణ
కోవిడ్‌ వ్యాక్సిన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ల్లో పెట్టినా శీతలీకరణ వ్యవస్థ నిర్ణీత పద్ధతిలో ఉందో లేదో హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షించవచ్చు. కోవిన్‌ టెంపరేచర్‌ లాగర్‌ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయవచ్చు. కాబట్టి టీకాలను కిందివాళ్లు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అన్న భయం లేదు. కోవిన్‌ టెంపరేచర్‌ లాగర్‌ వ్యవస్థనే కోల్డ్‌ సప్లయ్‌చైన్‌ మేనేజ్‌మెంట్‌ అంటారు. అత్యాధునిక పద్ధ్దతిలో నిర్వహణ ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే హైదరాబాద్‌ కేంద్రంలో చూడొచ్చు. దాన్ని క్షణాల మీద ఇంజనీర్లు సరిచేస్తారు.  

4 కోట్ల డోసుల నిల్వ సామర్థ్యం
రాష్ట్ర ప్రజలందరికీ ఒకేసారి కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి వచ్చినా నిల్వ చేసే సామర్థ్యం మన వద్ద ఉంది. స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్లలో 88 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం ఉంది. ఇక్కడ కోటిన్నర డోసులు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. జిల్లాల్లో మరో కోటిన్నర డోసులు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలల్లో మరో కోటి వ్యాక్సిన్లను నిల్వ చేయవచ్చు. అలా మొత్తం 4 కోట్ల వ్యాక్సిన్లను నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం వారానికి రెండ్రోజులు ఇతర వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. మిగిలిన నాలుగు రోజులు కరోనా టీకా వేస్తాం.  

రిఫ్రిజిరేటర్‌ స్థాయి కూలింగ్‌ చాలు
ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్‌ కూలింగ్‌ స్థాయిలోనే కరోనా టీకాలను నిల్వ చేయవచ్చు. అంటే 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్న వాకిన్‌ కూలర్లలో వ్యాక్సిన్లను నిల్వ చేస్తున్నాం. స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్, రీజనల్‌ వ్యాక్సిన్‌ సెంటర్లలో వాకిన్‌ కూలింగ్‌ సెంటర్లు ఉంటాయి. పది పాత జిల్లాల్లో వాటిని ఉంచాం. రెగ్యులర్‌ వ్యాక్సిన్లు, కరోనా వ్యాక్సిన్లు... రెండింటినీ నిల్వ చేస్తున్నాం. రెగ్యులర్‌గా యాంటీ రేబిస్, ఇన్సులిన్లు, ఇతర వ్యాక్సిన్లను కూడా నిల్వ చేస్తున్నాం.

50 లక్షల ఆటో డిసేబుల్‌ సిరంజీలు
కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేకంగా 50 లక్షల ఆటో డిసేబుల్‌ (ఏడీ) సిరంజీలు తెప్పిస్తున్నాం. ఇప్పటికే 15 లక్షలు రాష్ట్రానికి చేరాయి. ఇవి బయో డిస్పోజబుల్‌గా చెప్పుకోవచ్చు. ఒకసారి వాడితే... మళ్లీ వాడటానికి పనికిరావు. ఇవి ఎంతో సురక్షితం. పర్యావరణ హితం. ప్రస్తుతం వేసే కరోనా టీకాలు అత్యవసర వినియోగం కోసం తయారైనవి. కాబట్టి వాటి గడువు చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్లు ఒక సీజన్‌ కోసం... అవసరం మేరకు మాత్రమే తయారవుతాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top