మహిళల భద్రతకు ప్రాధాన్యత

CM KCR Review Meeting On Law And Order - Sakshi

బలహీనులపై దాడులు జరగకుండా కాపాడాలి

దళితులపై దాడులు శోచనీయం

చిన్నా, పెద్దా తేడా లేకుండా పౌరులందరికీ గౌరవమివ్వాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండాలి

గుడుంబా, గంజాయి, పేకాట, కలప స్మగ్లింగ్, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టాలి

పోలీసు కారుణ్య నియామకాల్లో జాప్యం వద్దు

శాంతిభద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహిళా భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకొని పనిచేస్తున్నామని, ఆ దిశగా పోలీసులు మరింత కృషి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తుండటం శోచనీయమని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఆకాంక్షించారు. దళితులపై దాడులు జరగకుండా చూడాలని, నిరంతరం అప్రమత్తతతో మెలగాలని పోలీసు శాఖను ఆదేశించారు. బలహీనులపై బలవంతులు దౌర్జన్యాలు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పౌరులందరికీ గౌరవమిస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తమ దగ్గరికి రక్షణ కోసం వచ్చిన అభాగ్యుల పట్ల పోలీసులు మానవీయ కోణంలో మెలగాలని హితవు పలికారు.

శాంతిభద్రతలు, మాదకద్రవ్యాలు, కలప స్మగ్లింగ్, పేకాట నిర్మూలన, గుడుంబా నియంత్రణ తదితర అంశాలపై సీఎం బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీసు, అటవీశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి పోలీసులు చేసిన కృషిని అభినందించారు. హైదరాబాద్‌ నగరంలో పది లక్షల సీసీ టీవీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని డీజీపీకి సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడానికి ఉపయోగించుకోవాలన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో తలపెట్టిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంనిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు.


గుడుంబా మళ్లీ వస్తోంది    
తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా ఉందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. గ్యాంబ్లింగ్‌ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందాపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను అడ్డదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందన్నారు. ఫేక్‌ సర్టిఫికెట్ల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గంజాయి, కలప స్మగ్లింగ్‌పై..
సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణాను అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. కలప స్మగ్లింగ్‌ను గత పాలకులు పట్టించుకోకపోవడంతో కొందరికి అలుసుగా మారిందని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుందని హెచ్చరించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీ అధికారులతో సివిల్‌ పోలీసులు కలిసి పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఇరుశాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగ్‌ నివారణకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. 

రిటైరైన రోజే పోలీసులకు పెన్షన్‌ మంజూరు చేయాలి
పోలీసుశాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్‌ సెటిల్‌ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. పోలీసుశాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో ఉంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు నిబంధనల ప్రకారం తక్షణమే ఉద్యోగం ఇవ్వాలన్నారు.

ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్‌ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు. పోలీసుశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమానికి మరింతగా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో, పోలీసుశాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదన్నారు. మహిళా పోలీసులకు ప్రత్యేకించి రెస్ట్‌ రూములు, వసతులు కల్పించాలన్నారు. ఈ సమీక్షలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

అవసరమైతే బీఎస్‌ఎఫ్‌ బలగాలు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మావోల నివారణకు అవసరమైతే బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బలగాలను దించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, ఈ మేరకు కేంద్ర హోంశాఖ సీనియర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ (ఎస్‌ఎస్‌ఏ) విజయ్‌కుమార్‌ ఇటీవల జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌ రెడ్డి వివరించారు. ఆపరేషన్‌ సమాధాన్‌ పేరుతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కేంద్ర బలగాలైన సీఆర్‌పీఎఫ్, కోబ్రా సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి మావోయిస్టుల ఏరివేత చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణను తిరిగి షెల్టర్‌ జోన్‌గా మార్చుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం వివిధ రాష్ట్రాలతో కేంద్రం సమన్వ యం చేసుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే మావోల ఏరివేతకు అవసరమైతే బీఎస్‌ఎఫ్‌ దళాలను సైతం రంగంలోకి దింపుతామని విజయ్‌కుమార్‌ హామీ ఇచ్చిన ట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు డీజీపీ వివరించినట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top