గ్రూపులు కడితే కొరడా! 

BJP leadership warns leaders for Group politics - Sakshi

పార్టీ ఎదుగుదలకు నష్టం చేస్తే వేటు తప్పదు 

నేతలకు బీజేపీ అధినాయకత్వం హెచ్చరిక 

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యత  

బండి పాదయాత్రపై ప్రత్యేక దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీలో గ్రూపు రాజకీయాలపై అధినాయకత్వం కన్నెర్రజేసింది. తెలంగాణలో ప్రస్తుతం పార్టీకున్న అనుకూల వాతావరణాన్ని గ్రూపులు కట్టి పాడు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, వారిపై కొరడా తప్పదని హెచ్చరించింది. రాష్ట్రంలోని వివిధ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయపార్టీల బలాబలాలు, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలు తదితర అంశాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్న వివిధ బృందాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపుతున్నాయి. అలాగే, వేర్వేరు సంస్థలు, వ్యక్తులు నిర్వహిస్తున్న సర్వేల్లోనూ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపడుతున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్రపై నాయకత్వం దృష్టిసారించింది. పాదయాత్ర సాగనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాసమస్యలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక నేతల పనితీరు తదితర అంశాలపై అధిష్టానం ఇదివరకే నివేదికను తెప్పించుకుంది. 

ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలి..
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కాషాయజెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న అధినాయకత్వం బండి పాదయాత్రతో సహా పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు తాజాగా ఆదేశాలిచ్చింది. కొందరు నాయకులు సహకరించకుండా గ్రూపులు కడుతున్నారనే నివేదిక నేపథ్యంలో ఇలాంటి పనులకు పాల్పడితే ఎంత పెద్ద నాయకుడైనా ఉపేక్షించబోమని, అంతా సమన్వయంతో పనిచేయకపోతే వేటు తప్పదని హైకమాండ్‌ సంకేతాలిచ్చింది. పాదయాత్రకు సహకరించని వారిపై అధిష్టానం చర్యలకు దిగనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో పార్టీ ముఖ్యనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌లతో బండి సంజయ్‌ సమావేశమైన సందర్భంగా పాదయాత్ర విజయవంతానికి అవసరమైన సహాయ సహకారాలపై హామీ లభించింది. 

బెంగాల్‌ పొరబాట్లు ఇక్కడ జరగకుండా...
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నా, కొన్ని పొరబాట్ల వల్ల విఫలమైనట్టు అధిష్టానం అంచనా వేస్తోంది. బెంగాల్‌లో ఎన్నికలప్పుడు సంస్థాగతంగా చోటుచేసుకున్న లోటుపాట్లు తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని భావిస్తోంది. గత ఎన్నికలకు ముందు పార్టీ నాయకులను సంప్రదించకుండా, అవకాశవాద నేతలను తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చేర్చుకోవడం వల్ల నష్టం జరిగినట్టు అంచనా వేస్తోంది. అందువల్ల తెలంగాణలో పార్టీ కోసం కష్టపడేవారిని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యతనిస్తూనే కొన్నేళ్లుగా పార్టీ కోసం కృషి చేస్తున్న వారిపై నిర్లక్ష్యం చూపొద్దనే భావనతో ఉంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top