Artificial Intelligence: కొత్త డాక్టర్‌.. ఏఐ!

Artificial Intelligence AI Even Better Treatment For patient - Sakshi

వ్యాధి నిర్ధారణలో, సరికొత్త మందుల ప్రభావాన్ని అంచనావేయడంలో కీలకం 

మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా వైద్యం 

రోగికి మరింత మెరుగైన చికిత్స లభించే అవకాశం 

వైద్యంలో టెక్నాలజీ ప్రమేయాన్ని ఎవరూ కాదనలేరు. గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తించేందుకు వాడే స్టెతస్కోపు మొదలుకొని మన శరీరంలోని వ్యాధులను, సమస్యలను గుర్తించే వరకూ అన్నింటిలో టెక్నాలజీదే కీలకపాత్ర. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. కృత్రిమ మేధ (ఏఐ) ఇంకో ఎత్తు. కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించడం, ఏ మందులు పనిచేస్తాయో? ఏవిచేయవో కూడా చెప్పేయ గల సత్తా సంపాదించుకుంది కృత్రిమ మేధ. వ్యాధి నిర్ధారణ మాత్రమే కాదు.. సరికొత్త మందులను గుర్తించడంతోపాటు మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా ఎక్స్‌రే, ఎమ్మారై వంటి వాటిని కచ్చితంగా అర్థం చేసుకోవడం వంటి బోలెడన్ని పనులు చేసి పెడుతోంది. అదెలాగో చూద్దాం..   
– సాక్షి, హైదరాబాద్‌

టీకాలు, మందుల గుర్తింపులో... 
కరోనా మహమ్మారికి టీకా కనుక్కోవడం మాత్రమే కాదు.. మందుల తయారీలోనూ కృత్రిమ మేధను ఉపయోగించారు. ఎంపిక చేసిన మందు ప్రభావాన్ని అంచనా వేసేందుకు, ఏ చర్యల ద్వారా మందు పనిచేస్తుందో గుర్తించేందుకు వాడారు. తొలిసారి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకాను తయారు చేసిన మోడెర్నా కృత్రిమ మేధ సాయంతోనే పరిశోధనలను వేగవంతం చేయగలిగింది. ఇతర వ్యాధులకు కొత్త మందులను గుర్తించడం, ఇప్పటికే ఉన్న వ్యాధులకు ఉపయోగిస్తున్న మందులను ఇతర వ్యాధుల చికిత్సకూ ఉపయోగించవచ్చా? అన్నది తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌ టెక్నాలజీ సాయంతో మందుల తయారీ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. అందుబాటులో ఉన్న పరిశోధనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్కవేయడం కృత్రిమ మేధ టెక్నాలజీ న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా సాధ్యం. వీటివల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా.. రోగికి మెరుగైన చికిత్స లభించే అవకాశమూ పెరుగుతుంది. 

ఎక్స్‌రే, సీటీ, ఎమ్మారై స్కాన్ల విశ్లేషణకు... 
ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్లను అర్థం చేసుకోవడం అంత సులువేమీ కాదు. ఏళ్ల అనుభవం ఉన్న వారు కూడా పొరబడుతుంటారు. అయితే ఒక పొరబాటు రోగి అనేక సమస్యలు ఎదుర్కొనేందుకు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయేందుకూ కారణం కావచ్చు. వీటన్నింటినీ అధిగమిచేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీతో కూడిన కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. అందుకే రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు ప్రస్తుతం ఏఐ సాయంతో రోగి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న క్యూర్‌ఏఐ, పుణేలోని డీప్‌టెక్‌ ఏఐలు.. ఎక్స్‌రేలు, తల, ఛాతి సీటీ స్కాన్లు, అల్ట్రాసౌండ్‌ చిత్రాలను విశ్లేషించి సరైన అంచనాలు ఇవ్వగలిగే టెక్నాలజీలను తెచ్చింది. డీప్‌టెక్‌ ఏఐ.. డిజిటల్‌ ఎక్స్‌రేల సాయంతో క్షయను వేగంగా గుర్తించేందుకు గెంకీ పేరుతో ఓ సాంకేతికతను సిద్ధం చేసింది.  

కేన్సర్‌ను పసిగట్టడంలో... 
కేన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాధిని గుర్తించడమే కాకుండా చికిత్స, మందుల ప్రభావం వంటి అనేక అంశాల్లో అక్కరకు వచ్చే కృత్రిమ మేధను అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎం తన సూపర్‌ కంప్యూటర్‌ ‘వాట్సన్‌’ ద్వారా చాలా ఏళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. పాథ్‌ ఏఐ లాంటి సంస్థలు కూడా కేన్సర్‌కు వ్యక్తిగత చికిత్స అందించే స్థాయికి చేరాయి. రొమ్ము కేన్సర్‌ విషయానికి వచ్చేసరికి కృత్రిమ మేధ.. మనిషికంటే మెరుగ్గా వ్యాధిని గుర్తిస్తుండటం విశేషం.

జర్మనీ బయోటెక్నాలజీ సంస్థ ఎవోటెక్, కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌సైంటియాలు కేన్సర్‌ చికిత్సకు ఏఐను వాడటమే కాకుండా తొలిదశ మానవ ప్రయోగాలకూ సిద్ధమవుతున్నాయి. కేన్సర్‌తోపాటు గుండెజబ్బులు, నాడీ సంబంధిత సమస్యలను ముందుగా గుర్తించడం, తద్వారా మెరుగైన చికిత్స కల్పించేందుకూ ఏఐ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నిరామయి. అంకోస్టెమ్‌లు మహిళల్లో రొమ్ము కేన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేయగా.. ఆర్టిలియస్‌ డయాబెటిక్‌ రెటినోపతీ కోసం ఏఐ టెక్నాలజీని తయారు చేసింది.  

అందరికీ ఆరోగ్యం అందించేందుకు...
కృత్రిమ మేధ పుణ్యమా అని టెలిహెల్త్‌ రంగంలోనూ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కోవిడ్‌–19 రాకతో టెలిమెడిసిన్‌ అవసరం మరింత పెరిగింది. కాల్‌హెల్త్‌ వంటి అప్లికేషన్ల వల్ల వినియోగదారులకు ఖర్చులూ తగ్గుతున్నాయి. ప్ర పంచవ్యాప్తంగా ఇది 2010లో 11 శాతం ఉండగా 2020 నాటికి ఇది 46 శాతానికి చేరింది. అమెరికాలో ఆరోగ్యరంగంపై పెట్టే ఖర్చుల్లో 20 శాతం టెలిమెడిసిన్‌ది. చేతికి తొడుక్కునే వాచీలోనే గుండె కొట్టుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు, ఈసీజీ, రక్తపోటు, రక్తంలో చక్కెర మోతాదుల వంటి వివరాలు తెలిసిపోతున్న నేపథ్యంలో రోగి ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోంది.

ఎలక్ట్రానిక్‌ రూపంలో వివరాలను పంపి వైద్యుల సూచనలు పొందే అవకాశాలు పెరిగాయి. వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, ఇతరులకు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్‌ టెక్నాలజీ ద్వారా వైద్యం అందించడం.. వారు చెప్పే లక్షణాలను విశ్లేషించేందుకు ఏఐను వాడటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. భారత్‌లో డాక్టీఏఐ, అకోస్‌ఎండీ వంటి సంస్థలు ఈ రకమైన సేవలు ఇప్పటికే అందిస్తున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top