‘వారి డిమాండ్‌ ప్రకారం చట్టాలు చేయడం దారుణం’

AIKSCC Farmer Groups Protest Against Agri Reforms Ordinance - Sakshi

కేంద్రానికి వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన

సాక్షి, హైదరాబాద్‌: “కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకం. అదానీల డిమాండ్ ప్రకారం చట్టాలు చేయడం దారుణం" అని పేర్కొంటూ రైతు సంఘాల నాయకులు గళమెత్తారు. పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల తొలి రోజే రైతులకు వ్యతిరేకంగా బిల్లులు ప్రవేశపెట్టారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీరును ప్రశ్నిస్తూ ఏఐకెఎస్‌సీసీ(ఆల్‌ ఇండియన్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 11.30 గంటల నుంచి చేపట్టిన బహిరంగ ప్రదర్శనలో పలు రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

ఏఐకెఎస్‌సీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, విస్సా కిరణ్ కుమార్ (రైతు స్వరాజ్య వేదిక), తెలంగాణా రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), టి.సాగర్ (తెలంగాణా రైతు సంఘం), కన్నెగంటి రవి (తెలంగాణ రైతు జేఏసీ), ఉపేందర్ రెడ్డి (తెలంగాణా రైతాంగ సమాఖ్య), రాయల చంద్రశేఖర్ (అఖిల భారత రైతు కూలీ సంఘం), గుమ్మడి నరసయ్య (మాజీ ఎమ్మెల్యే, సిపిఎంఎల్  న్యూడెమోక్రసీ),  బి.కొండల్ (రైతు స్వరాజ్య వేదిక), జంగా రెడ్డి (తెలంగాణ రైతు సంఘం) తదితరులు వీరిలో ఉన్నారు. 

ఈ సందర్బంగా.. లాక్‌డౌన్‌ అదునుగా చూసుకొని  వ్యవసాయాన్ని కార్పొరేట్ల పెత్తనానికి అప్పగించేందుకు 3 ఆర్డినెన్సులను తెచ్చిందని మండిపడ్డారు. ‘‘ఈరోజు పార్లమెంట్  సమావేశం మొదటి రోజునే ఈ మూడు ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో కేంద్రం ప్రవేశ పెట్టింది. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ బిల్లును రెండవ రోజునే (సెప్టెంబర్ 15న) ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. దీని వలన ఆహార వస్తువులను ఏ ఆంక్షలు లేకుండా అదానీ, రిలయన్స్ వంటి బడా కంపెనీలు నిల్వ చేసుకోవచ్చు, ఎటువంటి నిఘా ఉండదు కాబట్టి దొంగ నిల్వలు కూడా చేసుకోవచ్చు. దీని వలన వినియోగదారుల ధరలు పెరిగినా, ప్రభుత్వము  జోక్యం చేసుకునే అధికారం ఈ చట్ట సవరణ ద్వారా కోల్పోతున్నది’’ అని వివరించారు.

అదానీ, అంబానీల ప్రయోజనం కోసమే!
గత రెండు నెలలుగా రైతులు దేశమంతటా ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఆగష్టు 9న దేశమంతటా ఏఐకెఎస్‌సీసీ నేతృత్వంలో రైతులు ‘‘కార్పొరేట్ క్విట్ ఇండియా’’ అని నిరసన తెలిపారు. పంజాబ్‌లో 15 వేల  ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. హర్యానా రాష్ట్రంలోనూ వేలాది రైతులు నిరసన తెలిపితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇంత వ్యతిరేకత వస్తున్నా, కనీసం రైతు సంఘాలతో చర్చించకుండా, ఎటువంటి మార్పులు చేయకుండా, ఈ చట్టాలను పార్లమెంటులో బలవంతంగా ఆమోదింపజూస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం కాదు, అదానీ, అంబానీల ప్రయోజనం కోసమే అని మండిపడ్డారు.

ఇక రెండో బిల్లు అయిన.. "ఏపీఎంసీ బైపాస్ బిల్లు" ద్వారా ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి, తద్వారా కనీస మద్దతు ధరలు కల్పించడం, పంటల కొనుగోలు వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటోంది. ధర, తూకం, తేమ శాతం, గ్రేడింగ్ వంటి విషయాలలో రైతులు పూర్తిగా మోసపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి స్థితిలో వారికి ఎటువంటి రక్షణ ఉండదని, ఇకపై కనీస మద్దతు ధరల అమలు నుంచి తప్పుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కంపెనీలే రైతులకు మంచి ధర అందిస్తాయని చెబుతోందని, అయితే ఇప్పటి వరకు కాంట్రాక్టు సేద్యం వల్ల రైతులు లాభ పడిన దాఖలాలు లేవని, విత్తన రైతులు పూర్తిగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘రైతులు దోపిడీకి గురి అవుతున్నారు. పెద్ద విత్తన కంపెనీలు, పెప్సీ వంటి కార్పొరేట్ల వల్ల చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో రైతులకు ఏ మాత్రం రక్షణ కల్పించకుండా కాంట్రాక్టు సేద్యాన్ని ప్రోత్సహించే మూడో బిల్లు "కాంట్రాక్టు సేద్యం బిల్లు" అని పేర్కొంటూ రైతు సంఘాల నాయకులు ఈ చట్టాల వలన రైతులకు ఎదురయ్యే పరిస్థితుల గురించి వివరించారు. ఇలాంటి చట్టాలతో రైతులకు స్వేచ్చ లభిస్తుందని ప్రభుత్వము తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇవి పూర్తి తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి కేవలం కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పించే చట్టాలు మాత్రమేనన్నారు. 

అదే విధంగా కేంద్రం ప్రవేశపెడుతున్న విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు వల్ల రైతులకు వ్యవసాయంలో లభిస్తున్న ఉచిత విద్యుత్‌, సాధారణ వినియోగదారులకు లభిస్తున్న ఇతర రాయితీలు లభించవని పేర్కొన్నారు. దీని వలన రైతులపై విపరీతంగా భారం పెరుగుతుంది. దీనిని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతులు కోరుతున్నది "కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం". దానిని వెంటనే తీసుకురావాలని,ఈ మూడు కార్పొరేట్ వ్యవసాయ బిల్లులను, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు, రైతులు ముక్త కంఠంతో నినందించాయి. అంతేగాక తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఏఐకేఎస్‌సీసీ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top