వారితోనే ‘టెన్‌’షన్‌

60 Percent Corona Cases Are Only Because Of 10 Percent Super Spreaders - Sakshi

10% సూపర్‌ స్ప్రెడర్లతోనే సమస్యంతా.. 60% కేసులకు మూలం వారే

పిల్లలతోనూ వ్యాధి వ్యాప్తి!.. రోగులతో ప్రయాణం ప్రమాదకరం

ఇంట్లోంచి బయటకు అడుగు వేయని వారికీ కరోనా

కంటెయిన్మెంట్‌ జోన్లలో విచ్చలవిడిగా తిరిగినా అంటని వ్యాధి

కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌.. మిగిలిన వారికి నెగెటివ్‌

కరోనాపై సరికొత్త అంశాలను తెలిపిన అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌ : సామాన్యులైతే... ఏంటో అంతా మాయగా ఉందని సరిపెట్టుకుంటారు. కానీ, శాస్త్రవేత్తలు ఈ విచిత్రాలన్నింటినీ తరచి చూస్తారు! వైరస్‌ వ్యాప్తిపై మరిన్ని కొత్త విషయాలను తాజాగా తెలుసు కున్నారు! ప్రపంచం మొత్తమ్మీద కోవిడ్‌ బారిన పడినవారి సంఖ్య కోటి దాటిపోయింది గానీ.. ఈ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్‌ ఆనుపా నులు తెలిసింది కొంతే అన్నట్టుగా ఉంది. మిగిలిన దేశాల మాట ఎలా ఉన్నప్పటికీ భారతదేశంలో వైరస్‌ వ్యాప్తి ఎలా జరిగిందన్న అంశంపై అమెరికా లోని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ నిర్వహిం చిన ఓ సమగ్ర అధ్యయనం ఆసక్తికరమైన అంశా లను వెలికి తీసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వ్యాధి బారిన పడ్డ వారి కాంటాక్ట్‌లకు సం బంధించిన పూర్తి సమాచారం ఆధారంగా ఈ అధ్య యనం జరిగింది. ఇంత పెద్దస్థాయిలో సమాచార విశ్లేషణ మరే దేశంలోనూ జరగలేదని అంచనా. 

సూపర్‌ స్ప్రెడర్లే కీలకం...
రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం పూర్తి వివరాలు సైన్స్‌ మ్యాగజైన్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఆగస్టు ఒకటి నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో మొత్తం 4,35,000 కేసులు నమోదు కాగా వీరందరి కాంటాక్ట్‌ జాబితాలో 30 లక్షలమంది దాకా ఉన్నారు. వీరిలో 5,75,071 మందికి పరీక్షలు నిర్వహించగా 84,965 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వ్యాధి బారిన పడ్డవారిలో దాదాపు 70 శాతం మంది దాన్ని ఇతరులకు అంటించలేదని.. దాదాపు పదిశాతం మంది మాత్రం సూపర్‌ స్ప్రెడర్లుగా మారారని తేలింది. ఈ పదిశాతం మంది తరువాతి కాలంలో నమోదైన 60 శాతం కేసులకు మూలమయ్యారు. అయితే ఈ సూపర్‌స్ప్రెడింగ్‌ కోసం మనుషులు గుమికూడే కార్యక్రమం ఏదీ జరగాల్సిన అవసరం లేదని, సహజసిద్ధంగానే కొంతమంది..

ఎక్కువమందికి వ్యాధిని వ్యాపింపజేస్తే, అధికులు ఇతరులకు అసలు అంటించరని రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ తెలిపారు. గతంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న కారణంగా కొంతమంది ఇతరుల కంటే ఎక్కువ స్థాయిలో వైరస్‌ను విడుదల చేస్తుండటం సూపర్‌ స్ప్రెడర్‌లకు కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో వైరస్‌ బారినపడినవారిని వీలైనంత వేగంగా ఐసొలేషన్‌లోకి చేర్చడం ద్వారా వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోగలిగినట్లు ఈ అధ్యయనంల్లో పాల్గొన్న ఐఏఎస్‌ అధికారి బి.చంద్రమోహన్‌ చెప్పారు. 

దీర్ఘకాల ప్రయాణంతో సమస్యలు...
రక్షణ ఏర్పాట్లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా జరిపే ప్రయాణాలు వ్యాధి బారిన పడేందుకు దగ్గరిదారులని ఈ అధ్యయనం చెబుతోంది. అధ్యయనం కోసం పరిశీలించిన కాంటాక్ట్‌లలో కనీసం పదిశాతం మంది ప్రయాణాల కారణంగా వైరస్‌ బారిన పడ్డారని అంచనా. రోగులకు దగ్గరగా ఉంటూ ఆరు గంటలపాటు ప్రయాణం చేసినవాళ్లకు వైరస్‌ సోకే అవకాశాలు చాలా ఎక్కువ అని ఈ అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో 20– 44 ఏళ్ల వయసు వారు చాలా కీలకమన్నది ఈ అధ్యయనం తేల్చిన మరో విషయం. అంతేకాకుండా... పిల్లలు కూడా వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని తెలిసింది. వైరస్‌ బారిన పడ్డ పిల్లల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాముఖ్యత పెరిగింది. రోగుల కాంటాక్ట్‌లలో ఒకే వయసు వారు ఉంటే వారికి వైరస్‌ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. పద్నాలుగేళ్ల వయసు లోపు పిల్లల విషయంలో ఇది మరీ ముఖ్యమని ఈ అధ్యయనం తెలిపింది. 

వేగంగా మరణాలు....
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్‌ బారిన పడ్డ వృద్ధుల్లోనూ మరణాల సంఖ్య చాలా తక్కువని రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ తెలిపారు. అయితే పాజిటివ్‌గా గుర్తించిన తరువాత అతితక్కువ కాలంలోనే ప్రాణాలు పోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పాజిటివ్‌గా గుర్తించిన తరువాత వారం పది రోజుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని, అమెరికాలో ఈ సమయం పదమూడు రోజులుగా ఉందని వివరించారు. చైనాలో ఇది రెండు నుంచి ఎనిమిది వారాల వరకూ ఉందని తెలిపారు. వ్యాధి ముదిరే వరకూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరకపోవడం దీనికి కారణం కావచ్చని, ఇతర వ్యాధుల విషయంలోనూ భారత్‌లో ఇదే తరహా వైఖరి కనిపిస్తుందని ఆయన చెప్పారు.  

ఈ అధ్యయనంలో తేలిన స్థూల అంశాలు ఏమిటంటే...

  • కోవిడ్‌–19 బారిన పడినవారిలో 70 శాతం మంది దాన్ని ఇతరులకు అంటించలేదు.
  • అతితక్కువ మంది సూపర్‌ స్ప్రెడర్లుగా మారారు.
  • ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేస్తే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువ.
  • వైరస్‌ వ్యాప్తి విషయంలో పిల్లల పాత్ర మునుపటి అంచనాల కంటే ఎక్కువగా ఉంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top