‘కోవై’లో కలకలం రేపిన బాలిక హత్య | - | Sakshi
Sakshi News home page

‘కోవై’లో కలకలం రేపిన బాలిక హత్య

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

టీవీకే సర్కారుపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాలు

రంగంలోకి డీజీపీ

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు

కాళ్లు చేతులు విరగడంతో ఆస్పత్రి పాలు

సాక్షి, చైన్నె:కోయంబత్తూరులో ఇంటి బయట ఆడు కుంటున్న 10 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం, మరుసటి రోజు మృత దేహంగా తేలడం పెను కలకలాన్ని రేపింది. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టు వెలుగులోకి రావడంతో రాత్రంతా పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి. అధికార టీవీకేపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడంతో కేసును సీఎం విజయ్‌ ఓ సవాల్‌గా తీసుకున్నారు. డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఐజీ రమ్యభారతీతో పాటూ ఎస్పీ పవన్‌కుమార్‌రెడ్డి తదితరుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఉరకలు తీశాయి. 24 గంటలలో నిందితులు ఇద్దర్ని అరెస్టు చేశాయి. కాళ్లు చేతులు విరిగిన స్థితిలో ఆస్పత్రిలో నిందితులను చేర్పించారు.

కేసు వివరాలు..

కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ వచ్చింది. ఈనెల 21వ తేది సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది. దీంతో పరిసరాలలో గాలించినా ఫలితం లేక పోవడంతో పోలీసులను బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు. సూలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో శుక్రవారం సాయంత్రం సూలూరు సమీపంలోని ఓ చెరువు గట్టు పొదళ్లలో బాలిక మృతదేహంగా బయట పడింది. బాలిక శరీరంపై గాయాలు ఉండటంతో లైంగిక దాడి జరిగినట్టు వెలుగు చూసింది. దీంతో నిందితులను అరెస్టు చేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు బయలుదేరాయి. బాలిక మృత దేహాన్ని మార్చురీకి తరలించినా, పోస్టుమార్టం చేయనివ్వకుండా అడ్డుకున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి వరకు సూలూరు పరిసరాలలో ఆందోళనలు సాగాయి.

24 గంటల్లోనే ఛేదించాం: ఐజీ రమ్య భారతి

10 ఏళ్ల మైనర్‌ బాలికపై లైంగిక దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కోయంబత్తూరు ఐజీ రమ్య భారతి సాయంత్రం మీడియా సమావేశంలో వివరించారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల సమ యంలో ఇంటి బయట ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని రాత్రి 8:30 గంటలకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారన్నారు. అర్ధగంటలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారని, ఐదు ప్రత్యేక బృందాలు విచారణను వేగవంతం చేశాయన్నారు. సీసీటీవీ ఫుట్టేజీ, మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామన్నారు. నాగపట్నం జిల్లాకు చెందిన కార్తీ (33) అనే వ్యక్తి బాలికను తన వెంట తీసుకెళ్లిన ట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. కన్నంపాళెం ప్రాంతంలోని మరియా రోజ్‌ గార్డెన్‌ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో అతను ఉన్నట్టు గుర్తించి, చుట్టుముట్టి అరెస్టు చేశామన్నారు. తమ నుంచి తప్పించుకునే క్రమంలో పై అంతస్తు నుంచి కిందపడి అతని కుడి చేయి, కుడి కాలు విరిగాయన్నారు. అతడిని ఆస్పత్రికి తరలించి విచారించగా, మరో వ్యక్తి కూడా కేసులో ఉన్నట్టు తేలిందన్నారు. పళ్లపాళెం ప్రాంతానికి చెందిన కార్తీ స్నేహితుడైన మోహన్‌ (30)ను అరెస్టు చేశామన్నారు. కార్తీ ఆ బాలిక ఇంటి పక్కనే నివాసం ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. బాలికకు ఆశ చూపి నమ్మించి జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లానని, అక్కడ ఆమైపె లైంగిక దాడి (బలాత్కారం) చేసినట్లు అతడు అంగీకరించారని వివరించారు. ఈవిషయం బయటకు వస్తుందనే భయంతో కన్నంపాళెం చెరువు సమీపంలోని ఒక కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి బాలిక గొంతు నొక్కి హత్య చేసినట్లు తమకు కార్తీ వివరించాడన్నారు. ఈ నేరంలో ప్రధాన నిందితుడు కార్తీకి మోహన్‌ సహకరించినట్టు, అతడ్ని తప్పించే ప్రయత్నం చేసినట్టు తేలిందన్నారు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని, నగరంలో మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందే ఆర్థిక సహాయం (పరిహారం) త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై త్వరితగతిన చార్జీషీట్‌ నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

లైంగిక దాడి చేసి

హతమార్చినట్టు వెలుగులోకి..

ప్రభుత్వానికి సవాలుగా..

ఈ కేసు సీఎం విజయ్‌ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. ఇది ‘రీల్స్‌’ ప్రభుత్వం కాదు.. ’రియల్‌’గా వ్యవహరించండి అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విరుచుకు పడ్డారు. బాలిక అదృశ్యమైన వెంటనే సమాచారం ఇచ్చినా, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం ఈ ప్రభుత్వ పరిపాలనా లోపానికి, శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కేవలం మహిళల భద్రత అంటూ ప్రచారాలకే పరిమితం కాకూడదని మండి పడ్డారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని విరుచుకు పడ్డారు. టీవీకే సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 12 రోజుల పాటుగా జరిగిన హత్యలు, దోపిడీలు, లైంగిక దాడి కేసులను వివరిస్తూ, ఇదేనా శాంతి భద్రతల పరిరక్షణ, అబలకు రక్షణ అని ప్రశ్నించారు. అలాగే, అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌, పీఎంకే నేత రాందాసు వంటి వారు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో సీఎం విజయ్‌ స్వయంగా ట్వీట్‌ చేస్తూ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారని ప్రకటించారు. ఈ ఘటనపై అత్యంత వేగంగా, సమగ్రంగా విచారణ జరిపి, తక్షణమే కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించానని తెలిపారు. . మహిళలు, చిన్న పిల్లలపై జరిగే ఇలాంటి అరాచకాలకు ఒడిగట్టే వారికి చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడేలా కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా మంత్రి సంపత్‌ తదితరులతో పాటుగా డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ సైతం కోయంబత్తూరుకు శనివారం ఉదయాన్నే ఉరకలు తీశారు. బాధితులను పరామర్శించారు. కేసు దర్యాప్తును పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement