సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే నేతృత్వంలోని కూటమిని కాపాడే అంతటి బలం, శక్తి నాకు లేవు అని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, అనివార్య పరిస్థితుల వల్లే తాము టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు కూడా బాగా తెలుసనని పేర్కొన్నారు. వివరాలు.. తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో శనివారం తిరుమావళవన్ మీడియాతో మాట్లాడారు. టీవీకే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం, డీఎంకేతో బంధంపై ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పదవులపై ఆశతో కాదు.. కాలం తెచ్చిన మార్పు
తమ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి పదవీ కాంక్ష లేదని తిరుమావళవన్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ మంత్రివర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , వీసీకే పార్టీలు చేరాలని టీవీకే అధినేత నుంచి ఆహ్వానం అందిందన్నారు. దీనిపై తమ పార్టీ శ్రేణులు, కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చించామని, ఈ నెల 8న జరిగిన పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు మంత్రివర్గంలో చేరడమే సరైన నిర్ణయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. తనను కూడా వ్యక్తిగతంగా మంత్రి పదవి చేపట్టాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, తాను దానికి అంగీకరించలేదన్నారు. చివరకు పార్టీ తరపున వన్నియరసును మంత్రి పదవికి సిఫార్సు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది పదవుల కోసం చేసిన పని కాదని, ప్రస్తుత తమిళనాడు రాజకీయ సంక్షోభం దృష్ట్యా తీసుకున్న అనివార్య నిర్ణయంగా అభివర్ణించారు.
కూటమి విచ్ఛిన్నంకు కుట్ర
డీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరిగాయని, ఎన్నికలకు ముందు కూటమిని కాపాడటానికి తాను శతవిధాలా ప్రయత్నించినట్లు తిరుమావళవన్ వివరించారు. ఎన్నికల సమయంలో ఎవరితో ప్రయాణించాలనేది ఆయా పార్టీల వ్యూహాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు డీఎంకే నేతృత్వంలోని లౌకిక కూటమి బలంగా ఉండాలని తాను గట్టిగా నిలబడ్డాననని పేర్కొన్నారు. తనను ఏ ఒక ట్రంప్ కార్డ్‌గా వాడుకుని డీఎంకే కూటమిని ము క్కలు చేయడానికి పలు శక్తులు, కుల–మత సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయని తెలిపారు. తనను రెచ్చ గొట్టాలని చూశాయని, అయితే, ఎక్కడా లొంగకుండా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.
నాకు శక్తి లేదు
ఎన్నికల తర్వాత ఈ కూటమిని కాపాడే శక్తి తనకు లేదన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని గానీ, లెఫ్ట్ (కమ్యూనిస్టు) పార్టీలు తీసుకున్న నిర్ణయాలను గానీ అడ్డుకునే బలం కూడా తనకు లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనను కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తిరుమావళవన్
స్టాలిన్ రాజకీయ పరిణతికి నిదర్శనం
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకోవడానికే తాము కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్టు తిరుమావళవన్ వెల్లడించారు. ఒక పార్టీని స్థాపించి, దానిని పదేళ్లపాటు క్రమశిక్షణతో నడపడం అంత తేలికై న విషయం కాదన్నారు. తమ కూటమి నాయకుడు ఎంకే స్టాలిన్ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లామన్నారు. ఆయన ఆశీస్సులు, సమ్మతితోనే తాము కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించామన్నారు. ‘మీరు ఈ నిర్ణయం తీసుకోకూడదు’ అని అన్నా.. స్టాలిన్ ఎక్కడా మమ్మల్ని అడ్డుకోలేదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని, ఆయన ఎంతో పరిణతితో వ్యవహరించారని వివరించారు. మనం ఐక్యంగా ముందుకు సాగుదాం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మనం అడ్డంకిగా మారాల్సిన అవసరం లేదు.. అని స్టాలిన్ చెప్పారని గుర్తు చేశారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి, హుందాతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. చివరగా, వీసీకే ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై, తన రాజకీయ సమగ్రతపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విమర్శలను తాము అస్సలు ఖాతరు చేయబోమని తిరుమావళవన్ ఘాటుగా సమాధానమిచ్చారు.


