చైన్నె పోర్ట్ – మధురవాయల్
పనులపై పోర్ట్ ట్రస్ట్ చైర్మన్
విశ్వనాథన్ వెల్లడి
సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించామని ప్రకటన
సాక్షి, చైన్నె : గడిచిన ఆర్థిక సంవత్సరంలో చైన్నె, కామరాజర్ (ఎన్నూర్) రెండు ప్రధాన ఓడరేవులు కలిసి మొత్తంగా 107 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించాయని చైన్నె పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. విశ్వనాథన్, కామరాజర్ పోర్ట్ చైర్మన్ జె.పి. ఐరిన్ సింథియా తెలిపారు. ఇందులో చైన్నె పోర్ట్ 57.9 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా, కామరాజర్ పోర్ట్ 49.08 మిలియన్ టన్నుల రవాణా చేసిందన్నారు. ఈ రెండు పోర్టుల ఉమ్మడి కార్యాచరణ ఆదాయం రూ. 2,400 కోట్లు దాటగా, వీటి క్యాపిటల్ వ్యయం (మూలధన వ్యయం) వెయ్యి కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. ఇందులో చైన్నె పోర్ట్ రూ. 1,185 కోట్ల కార్యాచరణ ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా, పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 434 కోట్ల నికర మిగులు ఆదాయాన్ని నమోదు చేసిందని వివరించారు. అదేవిధంగా, కామరాజర్ పోర్ట్ రూ. 1,239 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. దేశంలోని ప్రధాన ఓడరేవులలోనే అత్యంత తక్కువ ఆపరేటింగ్ రేషియో (25.48శాతం) నమోదు చేసిన పోర్టుగా నిలిచిందని తెలిపారు. దీని ఎబిట్టా ( వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం) చరిత్రలోనే మొదటిసారిగా రూ. 1,000 కోట్ల మార్కును దాటి రూ. 1,071.63 కోట్లకు చేరిందన్నారు.
ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్
రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న చైన్నె పోర్ట్ ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ కు సంబంధించి రైట్స్ సంస్థ ప్రస్తుతం ట్రాఫిక్ సర్వేలు, అధ్యయనాలు చేస్తోందన్నారు. ఎరస్రముద్రం ప్రాంతంలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్–అమెరికా మధ్య వివాదాల కారణంగా ముడి చమురు దిగుమతుల్లో ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని అధిగమించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకు జరిగే వాహనాల ఎగుమతుల్లో సుమారు 6 నుండి 7 లక్షల టన్నుల వరకు ప్రభావం పడిందన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి , ఎగుమతిదారులను ఆదుకోవడానికి అదనపు స్టోరేజ్ (వేర్‌హౌస్) సదుపాయాలను, టారిఫ్ రాయితీలను (కట్టణ సలహా) కల్పిస్తున్నట్లు వివరించారు.
మౌలిక వసతుల విస్తరణ – కీలక ప్రాజెక్టులు
చైన్నె పోర్టుకు వచ్చే భారీ సరుకు రవాణా వాహనాల (కంటైనర్ లారీలు) ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నిర్మిస్తున్న పోర్ట్–మధురవాయల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2027 నవంబర్ నాటికి పూర్తి చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కామరాజర్ పోర్టులో భారీ నౌకల రాకపోకలకు వీలుగా రూ. 440 కోట్ల వ్యయంతో 6వ విడత లోతైన డ్రెడ్జింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీని ద్వారా తాజాగా 2.44 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అతిపెద్ద నౌకలు కూడా ఇక్కడకు వచ్చేందుకు వీలుందన్నారు.


