న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: జూన్ 1న పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లపై విద్యా మంత్రి రాజ్ మోహన్ దృష్టి పెట్టారు. చింతాద్రి పేట ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలను శనివారం సందర్శించారు. 2026–2027 విద్యాసంవత్సరానికి గానూ విద్యార్థులకు పంపిణీ చేయనున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పాఠశాల యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు తదితర వస్తువులను పాఠశాలలకు నేరుగా సరఫరా చేసే ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేశా రు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయని ఈసందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అందించాల్సిన ఉచిత విద్యా సామగ్రిని ఇప్పటికే అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు రవాణా చేశామన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లా కేంద్రాల నుండి నేరుగా పాఠశాలలకు ఈ వస్తువులను చేరవేసే పనులు ముమ్మరంగా సాగు తున్నాయని వివరించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్. కన్నప్పన్, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ పి.ఎ. నరేష్, చైన్నె జిల్లా ముఖ్య విద్యాధికారి కబీర్ , విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళపై ఆటోడ్రైవర్
లైంగిక వేధింపులు
అన్నానగర్: మహిళకు లైంగిక వేధింపులు ఇచ్చిన ఆటో డ్రైవర్ పై ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన ఇన్‌స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసు అధికారులను విధుల నుండి తొలగించారు. వివరాలు.. శివగంగ జిల్లాలోని దేవకోట్టైకి చెందిన మాధవన్ అలియాస్ తంగస్వామి (48), ఆటో డ్రైవర్. సంఘటన జరిగిన రోజు, 36 ఏళ్ల మహిళ అతని ఆటో ఎక్కింది. మాధవన్ ఆటోను ఒక నిర్మానుష్య ప్రాంతానికి నడిపి, ఆ మహిళను లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ అక్కడి నుంచి పారిపోయి ఏడుస్తూ, జరిగినదంతా తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత, ఆ మహిళ, ఆమె భర్త ఫిర్యాదు చేయడానికి దేవకోట్టై నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ అక్కడి పోలీసులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించి, మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని వారికి చెప్పారు. దీంతో వారు మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి పోలీసులు వారిని నగర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా భార్యాభర్తల మూడు రోజులుగా తిప్పిస్తున్నే ఉన్నారు. దీంతో వారు మధురైకి వచ్చి పోలీస్ ఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సరైన దర్యాప్తు జరపాలని ఐజీ ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ మాధవన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఫిర్యాదు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసుల పై కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించని దేవకోట్టై నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దురైరాజ్, స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ జయ, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గీతా లక్ష్మి, స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి , స్పెషల్ సెల్ పోలీస్ కానిస్టేబుల్ చందన కృష్ణన్ ఈ ఐదుగురిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. రామనాథపురం డీఐజీ మణివన్నన్, శివగంగై జిల్లా ఎస్పీ శివప్రసాద్ ఆదేశించారు.


