మళ్లీ కరోనా భయం..? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కరోనా భయం..?

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

● జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో జనం అవస్థలు

సాక్షి,చైన్నె: తమిళనాడులో గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా వచ్చే జ్వరాలు 3 లేదా 4 రోజుల్లో తగ్గిపోయేవి. అయితే, ప్రస్తుతం వస్తున్న జ్వరం వారం దాటినా తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కరోనా సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండేవో.. ఇప్పుడు కూడా అదే తరహాలో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ఉండటంతో, మళ్లీ కరోనా మహమ్మారి వ్యాపిస్తోందా? అనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఎండల తీవ్రత – పెరుగుతున్న రోగాలు

తమిళనాడు వ్యాప్తంగా గత కొన్ని వారాలుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం వంటి సమస్యలతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి రకాల జ్వరాలతో బాధపడుతూ అనేకమంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

అనుమానాలపై ఆరోగ్య శాఖ స్పందన

మళ్లీ కరోనా వ్యాపిస్తోందా? అనే అనుమానాలపై ప్రజారోగ్య శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. తమిళనాడులో డెంగీ సహా అన్ని రకాల జ్వరాలను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధారణంగా ఏ జ్వరానికై నా ప్రాథమిక లక్షణాలు ఒకేలా (దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు) ఉంటాయన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పెద్దఎత్తున పరీక్షలు చేసినట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చేయడం లేదన్నారు. అయితే, ఎవరికై నా తీవ్రమైన లక్షణాలు ఉండి, కరోనా పరీక్ష అవసరమని భావిస్తే.. వారికి కచ్చితంగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులకు సూచించామన్నారు. అలాగే జ్వరంతో బాధపడుతున్న రోగులు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరితే, వారికి తప్పకుండా పరీక్షలు చేస్తామని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement