సాక్షి, చైన్నె: తమిళనాడులోని కరూర్ జిల్లా కడవూర్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసిన సంఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ పొలం పనులలో ఉన్న ఒక రైతుపై గుర్తుతెలియని దుండగుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరూర్ జిల్లా కడవూర్ తాలూకా సేవప్పూర్ పరిధిలోని వలయాపట్టి గ్రామానికి చెందిన మురుగన్ కుమారుడు కరుణైగిరి (48) రైతు. శుక్రవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో కరుణైగిరి తన పొలానికి వెళ్లారు. అర్థరాత్రి వేళ పనులలో ఉన్న ఆయనపై చీకట్లో మాటువేసిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, నాటు తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తుపాకీలోని సుమారు 10 తూటాలు (బాల్‌రస్ గుండ్లు) ఆయన నడుము, వెన్ను భాగంలోకి బలంగా దూసుకెళ్లాయి. దీంతో ఆయన రక్తపు మడుగులో అక్కడికక్కడే పడి పోయారు. కాల్పుల శబ్దం విని స్థానికులు, తోటి రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కరుణైగిరిని రక్షించి, చికిత్స నిమిత్తం దిండిగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఘాతుకంపై సమాచారం అందుకున్న పాలవిడుతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


