మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై ఈడీ దృష్టి | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై ఈడీ దృష్టి

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

● దర్యాప్తునకు అనుమతి కోసం

ప్రభుత్వానికి లేఖ

సాక్షి, చైన్నె: తమిళనాడులో అవినీతి కేసుల దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై డీఎంకే మాజీ మంత్రి, తిరుచెందూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తమిళనాడు ప్రభుత్వానికి శనివారం అధికారికంగా లేఖ రాసింది. ఇప్పటికే మరో మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీపై దర్యాప్తునకు అనుమతి కోరిన ఈడీ, తాజాగా అనితా రాధాకృష్ణన్‌ పేరును కూడా చేర్చడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

కేసు నేపథ్యం ఇదీ..

2001 నుండి 2006 వరకు మంత్రిగా పనిచేసిన కాలంలో అనితా రాధాకృష్ణన్‌ తన ఆర్థిక వనరులకు మించి రూ. 2 కోట్ల, 7 లక్షల, 96 వేల, 384 విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని అవినీతి నిరోధక శాఖ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అనితా రాధాకృష్ణన్‌, ఆయన కుటుంబ సభ్యులపై విడిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

కోర్టులో బదిలీ వివాదం

ఈ కేసు ప్రస్తుతం తూత్తుకుడి ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉంది. అయితే, ఈ ఆస్తుల సమీకరణ కేసును మదురైలోని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కేసుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తూత్తుకుడి కోర్టు గత ఏడాది డిసెంబర్‌ 11న తిరస్కరించింది. దీనిపై ఈడీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కేసును మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడన్‌ల్ల ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ కేసుల విచారణ కోర్టుకు ఇతర అవినీతి కేసులను కూడా విచారించే అధికారం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఈడీ లేఖ రాయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement