చైన్నెస్ అమృత విద్యార్థులు
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ సినీ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు గల స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని తెలుపుతూ చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు పండ్లు, కూరగాయలతో వినూత్న రీతిలో సీఎం విజయ్ కళాఖండాలను రూపొందించి అబ్బురుపరిచారు. ముఖ్యమంత్రికి మిత్రుడైన నటుడు సంజీవ్ , చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌్ స్టిట్యూషన్స్ ఛైర్మన్ ఆర్.భూమినాథన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.చైన్నెలోని రాయపేటలో ఉన్న చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులు పూర్తిగా కూరగాయలు , పండ్లతో చెక్కిన కళాత్మక శిల్పాల ద్వారా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రస్థానాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శన ఇచ్చారు.ఈ ప్రదర్శనను నటుడు సంజీవ్, ఇనిస్టిట్యూట్ ఛైర్మెన్ ఆర్. భూమినాథన్ ప్రారంభించారు. విజయ్ తొలి చిత్రం నాలైయ తీర్పు నుండి జననాయగన్ వరకు గల మైలురాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తూ మొత్తం 69 శిల్పాలను రూపొందించారు. అసాధారణమైన సృజనాత్మకత, అంకితభావం , జట్టుకృషిని ప్రతిబింబిస్తూ, చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 10 రోజుల పాటు ఎంతో శ్రద్ధగా ఈ శిల్పాలను రూపొందించటం విశేషం. ఈ సందర్భంగా నటుడు సంజీవ్ విద్యార్థుల అద్భుతమైన కళా నైపుణ్యాన్ని, కృషిని ప్రశంసించారు.


