సాక్షి, చైన్నె : మైనారిటీలు వేసిన ఓట్ల రూపంలోనే ప్రస్తుతం డీఎంకే అనేక నియోజకవర్గాలలో గెలిచిందని, కావాలంటే లెక్కలేసుకుని చూసుకోండి అంటూ ఐయూఎంఎల్ నేత ఖాదర్ మొహిద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కూటమిలో దశబ్దాల పాటుగా ప్రయాణించిన ఐయూఎంఎల్ తాజాగా ఆ కూటమిని వీడిన విషయం తెలిసిందే. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఐయూఎంఎల్ భాగస్వామ్యం కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ మంత్రి అయ్యారు. తమను వీడిన ఐయూఎంఎల్‌ను టార్గెట్ చేస్తూ డీఎంకే వర్గాలు తీవ్రంగా విరుచుకు పడటం మొదలెట్టాయి. మైనారిటీలకు కవచంగా ఉన్న డీఎంకేకు ద్రోహం చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఓ మీడియాకు ఆ ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకేపై ఎదురు దాడి చేయడం గమనార్హం. మైనారిటీలో ఓట్లతోనే డీఎంకే అనేక చోట్ల గెలిచిందని, కావాలంటే లెక్కలేసుకుని చూసుకోండి అని హితవు పలికారు. తమను విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. తీవ్రంగా విమర్శిస్తే, అందుకు ఘాటుగా స్పందించేందుకు సైతం తాము వెనుకాడబోమన్నారు. డీఎంకేకు మైనారిటీల ఓటు బ్యాంకే రక్షణ కవచంగా ప్రస్తుత ఎన్నికలలో నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.


