సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఆలయాలన్నింటినీ ఇకపై మైక్రో మేనేజ్‌మెంట్ (సూక్ష్మ స్థాయి పర్యవేక్షణ) పద్ధతి ద్వారా తన ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ ప్రకటించారు. వివరాలు.. తిరుచ్చిలోని భారతీదాసన్ రోడ్డులో ఉన్న ప్రముఖ చారిత్రక చక్రవర్తి పెరుంబిడుగు ముత్తరైయర్ జయంతి ఉత్సవాల్లో శనివారం మంత్రి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముత్తరైయర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు కూపా కృష్ణన్, జిల్లా కలెక్టర్ శరవణన్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మధుబాలన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మా సిద్ధాంతం లౌకిక సామాజిక న్యాయం
మతం, కులం, డబ్బు, భాష, లింగం అనే ఎలాంటి వివక్ష లేని సమాజ స్థాపనే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత విజయ్ ముందుంచిన లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతమే తమ విధానం అన్నారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను తమ సిద్ధాంత నాయకులుగా అంగీకరిస్తూ, ఆ ఆశయాలను గుండెల్లో నింపుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామరన్నారు.
డబ్బు, కులం చూసి పదవి ఇవ్వలేదు
తమ నాయకుడు (విజయ్) తమ పదవులు ఇచ్చింది కులమో, డబ్బో చూసి కాదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే గుణాన్ని చూసి మాత్రమే ఈ అవకాశం కల్పించారన్నారు. ఇక్కడ కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పాన్ని మాత్రమే చూడాలన్నారు. ప్రజలంతా తమ అధినేతను చూసి ఓటేశారు తప్పతమ ముఖాలు చూసి కాదన్నారు. సినిమా తెరపై విజయ్‌ని చూసేటప్పుడు ఎవరూ కులమతాలు చూడలేదని, రాజకీయాల్లోనూ ప్రజలు మమ్మల్ని అలాగే చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆలయాల ఆస్తుల రక్షణ – అవినీతిపై ఉక్కుపాదం
దేవాదాయ శాఖ పరిధిలో ఎలాంటి అవినీతిని సహించేది లేదని మంత్రి రమేష్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఎవరూ కూడా అవినీతికి పాల్పడటానికి లేదా అధికార దుర్వినియోగానికి ఒడిగట్టడానికి వీల్లేదన్నారు. మైక్రో మేనేజ్‌మెంట్ విధానం ద్వారా ప్రతి చిన్న విషయాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇప్పటివరకు ఆలయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగి ఉంటే వాటన్నింటినీ సరిదిద్ది, దేవాదాయ శాఖను ఒక ఆదర్శవంతమైన శాఖగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ప్రశాంతమైన మనసుతో స్వామివారిని దర్శించుకుని వెళ్లేలా రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతామన్నారు. సుదీర్ఘ సమయం క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితిని తగ్గిస్తామన్నారు. అలాగే ఆలయాలకు సంబంధించిన భూములు, ఆస్తుల ఆక్రమణలపై నిరంతరం సమీక్షలు జరిపి, ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని వివరించారు. మందుగా శ్రీరంగం, తిరువానైకోవల్ ప్రాంతాల్లోని భూగర్భ (అడిమనై) భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి గానూ అధికారులతో చర్చిస్తున్నట్టు వివరించారు.


