రిజర్వాయర్‌లలో 7.5 టిఎంసీల నీరు నిల్వ | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌లలో 7.5 టిఎంసీల నీరు నిల్వ

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

● వేసవిలో తాగునీటి కొరత ఉండదు ● అదనపు కార్యదర్శి సత్యబ్రత సాహూ

తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లలో నీటి మట్టం సుమారు 7.50 టీఎంసీల మేరకు నిల్వ వున్న క్రమంలో వేసవి నాటికి నీటి కొరత వుండదని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి సత్యబ్రత సాహూ వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లాలోని పూండి సత్యమూర్తి సాగర్‌ రిజర్వాయర్‌, కాంచీపురంలోని చెమరంబాక్కం రిజర్వాయర్‌లను అధికారులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. పూండి రిజర్వాయర్‌ వద్దకు వచ్చిన సత్యబ్రత, కాలువలు, తెలుగు–గంగ ప్రాజెక్టు కాలువలు, షట్టర్‌ల పనితీరుతో పాటూ ఇతర అంశాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ఆనకట్ట, రిజర్వాయర్‌ల ప్రతిపాదనలపై సైతం ఆరా తీశారు. గతంలో వరదల వల్ల కొట్టుకపోయిన బ్రిడ్జిలు, ఆనకట్టలు, వాటి మరమ్మతు పనుల పురోగతిపై సైతం వివరాలను సేకరించారు. తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాలో ప్రధానంగా నాలుగు రిజర్వాయర్‌ల నిర్మాణం చేయాలన్న ప్రతిపాధన ప్రభుత్వం వద్ద ఉందని, వీటికి సుమారు రూ.1,500 నుంచి రెండువేల కోట్లు రూపాయల మేరకు ఖర్చు అయ్యే అవకాశం వుందని వివరించారు. ఇందుకు జోక్యం చేసుకున్న సాహూ, అంత పెద్దమొత్తంలో కేటాయింపులపై సీఎం వద్ద చర్చించి నిర్ణయం తీసుకుందామని అధికారులకు వివరించారు.

నీటి కొరత వుండదు

తనిఖీ అనంతరం సత్యప్రదసాహూ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపనులశాఖ కార్యదర్శిగా నియమితులైన తరువాత తాను చైన్నెకు నీటిని అందించే ప్రాజెక్టులను తనిఖీ చేస్తున్నామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. చెమరంబాక్కం, పూండీ రిజర్వాయర్‌లను పరిశీలించామని, తనిఖీల్లో తమకు సంతృప్తికరంగా ఉందన్నారు. చెమరంబాక్కంరెడ్‌హిల్స్‌, చోళవరం, కన్నన్‌కోట–తేరువాయి కండ్రిగ, పూండి తదితర రిజర్వాయర్‌లలో 7.5 టిఎంసీల నీరు నిల్వవుంది. ప్రతి నెలా చైన్నెకు తాగునీటి అవసరాల కోసం 1.50 టీఎంసీల నీరు అవసరం వుంది. ప్రస్తుతం వున్న నీరు మరో ఐదు నెలలకు సరిపడుతుంది. త్వరలోనే వర్షాకాలం రానున్న క్రమంలో నీటి ఎద్దడి వుండదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనిఖీల్లో కలెక్టర్‌ ప్రతాప్‌, చీఫ్‌ ఇంజినీర్‌ పొదుపనితిలగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement