సాక్షి, చైన్నె : చైన్నె మహానగరపాలక సంస్థ కొత్త కమిషనర్‌గా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన సమీరన్ నగరాభివృద్ధిపై తన ప్రణాళికలను శనివారం ప్రకటించారు. చైన్నెని సుందరంగా, పచ్చదనంతో కూడిన చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు విషయాలను వివరించారు.
నగర సుందరీకరణ ప్రాజెక్టులు
గతంలో నిలిచిపోయిన చైన్నె సుందరీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. నగరంలోని పార్కులు, బహిరంగ ప్రదేశాలను పునరుద్ధరిస్తామన్నారు. ఫ్లైఓవర్ల (ఫ్లైఓవర్ల కింది భాగం) కింద చెత్త వేయకుండా నిరోధించి, అక్కడ అందమైన పెయింటింగ్‌లు, రంగురంగుల దీపాలు ఏర్పాటు చేసి, మొక్కలు నాటుతామని వివరించారు.
ముందస్తు పనులు
అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాల కంటే ముందే నగరంలో వర్షపు నీటి పారుదల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతున్న పనులను వేగవంతం చేస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. చైన్నె నగర హరిత ప్రాజెక్టు ద్వారా పార్కులు, ఆట స్థలాలను అభివృద్ధి చేస్తామని వివరించారు.
అమ్మ క్యాంటీన్ల నాణ్యత పెంపు
ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు అమ్మ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. రాత్రి వేళల్లో తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నానని చెప్పారు. ఒక తనిఖీలో ఓ చోట కుక్కర్ లేదని తెలియడంతో మరుసటి రోజే కొనుగోలు చేయించామన్నారు. క్యాంటీన్లలో వంటకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామనివివరించారు.. ప్రస్తుతం ప్యాక్ చేసిన ఆహారం కాకుండా, అక్కడికక్కడే తాజా ఆహారాన్ని తయారు చేసి అందించేలా అధికారులకు రోజూవారీ తనిఖీలు నిర్వహించాలని సూచించామన్నారు.


