కొనసాగుతున్న విద్యుత్‌ కోతలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విద్యుత్‌ కోతలు

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

● రెండు ప్రాంతాల్లో రాస్తారోకో

తిరుత్తణి: తిరుత్తణి శివారులో మూడు రోజులుగా విద్యుత్‌ కోతతో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో ఆగ్రహం చెందిన స్థానికులు శనివారం రెండు ప్రాంతాల్లో రాస్తారోకో చేశారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో గురువారం గాలివాన బీభత్సానికి చెట్లు నేలకొరిగి విద్యుత్‌ స్తంభాలు కూలి విద్యుత్‌ వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట పరిసర ప్రాంతాల్లో 20 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ సిబ్బంది మూకుమ్మడిగా కృషిచేసి చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. అయితే తిరుత్తణి మున్సిపాలిటీలోని కుమారకుప్పం, పాపిరెడ్డిపల్లెలో కూలిన విద్యుత్‌ స్తంభాలు తొలగించి విద్యుత్‌ సేవలు కల్పించకపోవడంతో తాగునీటికి కష్టాలు తీవ్రమయ్యాయి. రాత్రుల్లో నిద్ర లేక చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం చెందిన పాపిరెడ్డిపల్లె ప్రజలు పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాహన సేవలు స్తంభించాయి. క్వారీకి వెంటనే విద్యుత్‌ సరఫరా అందించిన అధికారులు తమ ప్రాంతంలో మూడు రోజులుగా విద్యుత్‌ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విధంగా తెక్కళూరులో మూడు రోజులుగా విద్యుత్‌ కోతలతో ఆ ప్రాంతం వాసులు రాస్తారోకో చేసి విద్యుత్‌శాఖ అధికారుల తీరుకు నిరసన తెలిపారు.

తెగిన విద్యుత్‌ తీగ తొలగింపులో అలసత్వం

పళ్లిపట్టు యూనియన్‌లోని రామానాయుడు కండ్రిగ, సీఎన్‌ కండ్రిగ గ్రామాల్లో మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక గ్రామీణులు చీకట్లో జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. అయితే రామానాయుడు కండ్రిగ ప్రదాన రోడ్డులో తెగిపడిన హై ఓల్టేజ్‌ విద్యుత్‌ తీగ తొలగింపునకు విద్యుత్‌ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement